kcr: రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
- కొత్త జోనల్ వ్యవస్థపై కేంద్రం ఆమోదం కోసమే ఢిల్లీకి
- మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్న కేసీఆర్
- కేంద్ర పెద్దలతో పాటు ప్రధానిని కలిసే అవకాశం
ఉద్యోగావకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో కొత్త జోనల్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ జోనల్ వ్యవస్థ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే నిమిత్తం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో ఆయన రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నట్టు సమాచారం. కొత్త జోనల్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన చర్చిస్తారని, అవసరమైతే, ప్రధాని మోదీని కలిసి దీని గురించి వివరించి చెబుతారని సమాచారం. కాగా, తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించిన ఫైల్ ప్రధాన మంత్రి కార్యాలయంలో పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని ఆమోదించాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరనున్నారు.