maoists: మావోయిస్టులపై నిషేధాన్ని పొడిగించిన ఏపీ ప్రభుత్వం
- నిషేధాన్ని మరో ఏడాది పొడిగించిన టీడీపీ ప్రభుత్వం
- 1991లో తొలిసారి నిషేధం విధించిన నేదురుమల్లి
- వైయస్ హయాంలో నిషేధం ఎత్తివేత
మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1991లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మావోయిస్టులపై తొలిసారి నిషేధం విధించారు. అప్పుడు మావోయిస్టులు పీపుల్స్ వార్ పేరుతో పని చేసేవారు. పీపుల్స్ వార్ కు అనుసంధానంగా ఉన్న రాడికల్ యువజన సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం, రైతుకూలి సంఘం, ఆర్టీసీ కార్మిక సంఘం, సింగరేణి కార్మిక సంఘాలపై కూడా నిషేధం విధించారు.
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మావోలపై నిషేధాన్ని ఎత్తి వేశారు. 2005 ఆగస్టు 15న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డితో పాటు తొమ్మిది మందిని మావోలు చంపేశారు. మృతుల్లో నర్సిరెడ్డి కుమారుడు వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మావోలపై మరోసారి ఏడాది పాటు నిషేధం విధించారు. అప్పటి నుంచి నిషేధం కొనసాగుతూనే వస్తోంది. మరోవైపు పౌరహక్కుల సంఘాలు, విప్లవ సంఘాలు మావోలపై నిషేధాన్ని ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.