Pawan Kalyan: మహిళా సాధికారతకు సామాజిక వెన్నుదన్ను అవసరం: పవన్ కల్యాణ్

- జనసేన 'వీర మహిళ' విభాగంతో పవన్ సమావేశం
- మన ఆడపడుచులందరిలో నిగూఢమైన శక్తి ఉంది
- ప్రతి స్త్రీ మూర్తి మల్టీ టాస్కింగ్ నిపుణురాలే
జనసేన మహిళా విభాగంలో భాగం అయ్యేందుకు ఎందరో అక్కాచెల్లెళ్లు ఆసక్తి చూపిస్తుండటం సంతోషకరమైన విషయమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించిన 'వీర మహిళ' విభాగం సమావేశాన్ని నిర్వహించారు. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల వీర మహిళ నాయకురాళ్లు హాజరయ్యారు.
వారికి పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధులపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, అరుపులు కేకలు, నినాదాలతో మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, మిగిలిన పార్టీల్లా రాజకీయాలు చెయ్యక్కరలేదని, వివేకం, విజ్ఞత, సహనం ఉన్న మహిళా సేనను సిద్ధం చేసుకుందామని అన్నారు.
‘స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే సంస్కృతి మనది. అలాంటి మన దేశంలోనే ఆడపడుచులకు కనీస భద్రత కల్పించలేకపోతున్నారు. స్త్రీ అర్థరాత్రి ఒంటరిగా వెళ్లగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. ఇప్పుడు పట్టపగలు కూడా స్త్రీలు ధైర్యంగా వెళ్లలేని పరిస్థితి ఉంది. మహిళలకు కనీస భద్రత కల్పించడం అవసరం. వారి పనిని వారిని స్వేఛ్చగా చేసుకోనిస్తే చాలు. వారి దారికి అడ్డు రావద్దు. మహిళా సాధికారత రావాలి అంటే సామాజిక మద్దతు చాలా అవసరం.
మహిళలు రాజకీయాలు, ప్రజా జీవితం, సేవా రంగంలోకి వచ్చేటప్పుడు సామాజికంగా వారికి వెన్నుదన్ను ఇవ్వాలి. ఇలా వచ్చేటప్పుడు నవ్వుతారు... నిరుత్సాహపరుస్తారు. అయితే, బలమైన సంకల్పం, లక్ష్య సాధనపై ఆత్మ విశ్వాసం ఉండాలి. మన ఆడపడుచులందరిలో నిగూఢమైన శక్తి ఉంది. మన ఇంట్లోనే అమ్మను చూడండి... వంటిల్లు చక్కబెడుతుంది. పిల్లల బాధ్యత చూస్తోంది, భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఆర్థిక విషయాలను చూసుకొంటుంది. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తుంది. ఇది ప్రతి మహిళకి తెల్సిన మల్టీ టాస్కింగ్ నైపుణ్యమే. మగవారే ఇలా మల్టీ టాస్కింగ్ చేయలేరు.
