Supreme Court: వివాహేతర సంబంధాల చట్టాన్ని సవరించే ఉద్దేశం లేదన్న సుప్రీంకోర్టు
- మహిళలు నేరం చేసి తప్పించుకుంటున్నారని పిటిషన్
- పట్టుబడే మహిళలు బాధితులు మాత్రమే
- దోషులుగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు కీలక రూలింగ్
వివాహేతర సంబంధాలలో పట్టుబడే మహిళలను కేవలం బాధితులుగానే పరిగణిస్తామని, వారిపై కేసులు పెట్టి నిందితులుగా చూపించాలన్న ఆలోచన తమకు లేదని సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. వివాహేతర సంబంధాల చట్టాన్ని (అడల్ట్రీ లా) తాకాలన్న ఉద్దేశంగానీ, సవరణలు చేయాలన్న ఆలోచనగానీ తమకు లేదని పేర్కొంది. వివాహేతర సంబంధాల చట్టాన్ని, లింగ సమానత్వ చట్టాన్ని ఒకటిగా చూడలేమని తెలిపింది. ఐపీసీలోని చట్టాల ప్రకారం వివాహేతర సంబంధాలు పెట్టుకున్న మహిళలను దోషిగా పరిగణించే వీలు లేకుండా పోయిందని, దీనివల్ల ఎంతో మంది మహిళలు తప్పించుకుంటున్నారని, చట్టాన్ని మార్చాలని దాఖలైన పిటిషన్ పై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది.
ఇదే సమయంలో నేరానికి పాల్పడితే చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రోహిన్టన్ ఫాలీ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవీ చంద్రచూద్, జస్టిస్ ఇందూ మల్ హోత్రాలతో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. ఇదే సమయంలో మరొక వ్యక్తి భార్యతో వివాహేతర బంధాన్ని పెట్టుకుని, ఆమె అంగీకారంతో సెక్స్ జరిపి పట్టుబడితే పురుషుడిని జైలుకు పంపిస్తున్నారన్న అంశంపై, పురుషులకు ఊరట కలిగించే విషయమై పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.
కాగా, ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం, ఓ వ్యక్తి మరొకరి భార్యతో అతనికి తెలియకుండా ఆమె అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే, అది అత్యాచారం కాదుగానీ, శిక్షించదగ్గ నేరమే. ఈ కేసులో నేరం రుజువైతే ఐదేళ్ల వరకూ శిక్ష విధించవచ్చని ఈ సెక్షన్ చెబుతోంది. ఇదే సెక్షన్ తప్పు చేసే మహిళలను మాత్రం బాధితురాలిగా మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సెక్షన్ 158 సంవత్సరాల నాటిది కావడంతో దీన్ని సవరించాలని 1954లో ఓ సారి, 1985లో మరోసారి అత్యున్నత ధర్మాసనం సమీక్షించింది. అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు మారాయని, ఈ మేరకు చట్ట సవరణ చేయాలని దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.