aadhaar: ఆధార్ అడ్రస్ ను ఇక ఆన్ లైన్ లో మార్చుకోవచ్చు!
- శుభవార్త తెలిపిన యూఐడీఏఐ
- చిరునామా మార్పుకు పిన్ పంపిస్తామని వెల్లడి
- వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం
వృత్తిరీత్యా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూ ఆధార్ లో అడ్రస్ మార్చుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) శుభవార్త తెలిపింది. ఇకపై ఆధార్ కేంద్రాలకు రాకుండానే ప్రజలు ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ ద్వారా తమ ఆధార్ కార్డులోని అడ్రస్ ను మార్చుకోవచ్చని వెల్లడించింది. ఇందుకోసం లేఖ ద్వారా ప్రత్యేకమైన పిన్ జారీచేస్తామని పేర్కొంది.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలకు ఆధార్ ను అడుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగంలో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అవుతున్న వారు, ఉపాధి కోసం మరోచోటికి వెళ్లి స్థిరపడ్డవారు ఆధార్ కార్డులో అడ్రస్ మార్పుకు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీంతో బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డు పిన్ నంబర్లను లెటర్ లో ఇచ్చినట్లు, ప్రత్యేకమైన పిన్ ను సంబంధిత వ్యక్తులు కోరుకున్న అడ్రస్ కు పంపిస్తామని యూఐడీఏఐ వెల్లడించింది.
అడ్రస్ లో మార్పులుచేర్పుల కోసం తమకు పిన్ పంపాలని ప్రజలు యూఐడీఏఐని కోరవచ్చని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. ఫలితాలను పరిశీలించి అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు.