Sabarimala: 10 నిమిషాల సమయం ఇస్తే రెండు గంటల వాదన... భేష్ అన్న సుప్రీంకోర్టు.. అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై కేసులో విశేషం!

  • దేవుడి తరఫున వాదనలు వినిపించిన హైదరాబాద్ న్యాయవాది సాయి దీపక్
  • ఆయనకూ హక్కులు ఉన్నాయని వాదన
  • రాజ్యాంగ నిబంధనలు వివరిస్తూ వాక్పటిమ
  • తుది తీర్పును వాయిదా వేస్తున్నామన్న ధర్మాసనం

కేరళలోని పరమ పవిత్ర శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ప్రవేశం కల్పించాలా? వద్దా? అన్న విషయమై, సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన హైదరాబాద్ న్యాయవాది సాయి దీపక్, ధర్మాసనంతో 'భేష్' అనిపించుకున్నారు. తనను తాను దేవుడి తరఫు న్యాయవాదిగా ప్రకటించుకోగా, వాదనలు వినిపించేందుకు 10 నిమిషాల సమయాన్ని ధర్మాసనం ఇచ్చింది. అయితే, తన వాక్పటిమ, లాజిక్ తో సాయి దీపక్ వాదన రెండు గంటల పాటు సాగింది. ఆయన వాదన జ్ఞాన బోధకంగా ఉందని న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారిమన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఆలయ యజమాని అయిన దేవుడికి, తన ఇంట్లో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ వున్నాయని, నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవడం అందులో భాగమేనని దీపక్ వాదించారు. దేవుడు కూడా న్యాయబద్ధమైన వ్యక్తిగా గతంలో కోర్టు గుర్తించిందని ఆయన గుర్తు చేశారు. "మహిళల హక్కుల సంగతి సరే, మరి దేవుడి విశ్వాసాలకు విలువ లేదా? ఆయనకూ హక్కులన్నీ ఉంటాయి. బ్రహ్మచారిగా ఉండే హక్కు ఆయనకుంది. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆలయానిదే" అంటూ దీపక్ చేసిన వాదన అందరినీ ఆకట్టుకుంది.

దేవుడి హక్కులను హరించడం కుదరదని,  వందలాది మందిని చంపిన ఉగ్రవాదులకు న్యాయ సహాయాన్ని అందిస్తున్న వేళ, దేవుడికి అన్యాయం జరుగుతుంటే, ఆయన తరఫున వాదించడం సమంజసమేనని భావించి తాను వచ్చానని ధర్మాసనానికి దీపక్ తెలిపారు. మహిళలను నియంత్రించడం హాస్యాస్పదం అంటున్న వారికి దేవుడిపై భక్తి ఉందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) కింద ప్రజలకు తమ ధర్మాన్ని పాటించే హక్కు ఉన్న విధంగానే, దేవుడికి కూడా తన ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ ఉందన్నారు.

ఆపై కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయ్యాయని చెప్పిన ధర్మాసనం, ఉభయపక్షాల న్యాయవాదులు మరేదైనా చెప్పాలనుకుంటే, ఏడు రోజుల్లోగా తమ వాదనను సంక్షిప్తంగా తెలియజేయాలని ఆదేశిస్తూ, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

Sabarimala
Ladies
Supreme Court
  • Loading...

More Telugu News