Cheddy gang: మొత్తానికి చెడ్డీగ్యాంగ్ ఆటకట్టించిన పోలీసులు.. ఆరు నెలల ఆపరేషన్ తర్వాత అరెస్ట్!

  • హైదరాబాదీలను వణికించిన చెడ్డీ గ్యాంగ్
  • ఆరు నెలల ప్రయత్నం తర్వాత పట్టుకున్న పోలీసులు
  • బంగారం, వెండి స్వాధీనం

గత కొన్నాళ్లుగా హైదరాబాద్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఆగడాలకు తెరపడింది. గ్యాంగు అడ్డాను కనిపెట్టిన రాచకొండ పోలీసులు ఆరు నెలల ప్రయత్నం తర్వాత విజయవంతంగా వీరికి సంకెళ్లు వేశారు. గుజరాత్‌కు చెందిన ముఠా సభ్యులంతా పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ఆదివాసీలని పోలీసులు తెలిపారు. చెడ్డీ గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారు. విచిత్ర వేషధారణతో వచ్చి దొంగతనాలకు పాల్పడే ఈ గ్యాంగులోని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పది తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు.  

తాళం వేసి ఉన్న ఇళ్లే చెడ్డీ గ్యాంగ్ టార్గెట్. అమాయకంగా కనిపించే వీరు చీకటి పడగానే విశ్వరూపం ప్రదర్శిస్తారు. తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి అందిన కాడికి దోచుకుంటారు. ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు. చోరీ చేసే సమయంలో చెడ్డీ మాత్రమే ధరిస్తారు. శరీరానికి నూనె పూసుకుంటారు. వెంటాడితే రాళ్లు విసిరి తప్పించుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలను కొన్ని నెలలపాటు వణికించిన వీరిని పోలీసులు పక్కా ప్లాన్‌తో సాంకేతికతను ఉపయోగించి పట్టుకున్నారు.  

చెడ్డీ గ్యాంగ్ కదలికలపై నిఘా పెట్టిన రాచకొండ పోలీసుల ప్రత్యేక బృందం ముఠా వివరాలు తెలుసుకునేందుకు గుజరాత్‌లోని దాహోద్‌కు వెళ్లింది. అక్కడ నెలరోజులున్న పోలీసులు గ్యాంగ్ కదలికలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీనికి సాంకేతికతను జోడించి పక్కా ప్రణాళిక రచించి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా గ్యాంగ్ సభ్యులను కూడా త్వరలోనే పట్టుకుంటామని రాచకొండ పోలీసులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News