Chandrababu: ఆ కాల్వకు ‘పరిటాల రవీంద్ర కాల్వ’ గా పేరు పెడతాం: సీఎం చంద్రబాబు
- అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు
- పేరూరు ప్రాజెక్ట్ కు నీటిని తరలించే కాల్వకు భూమి పూజ
- కృష్ణపట్నం పోర్టును అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి నిర్మిస్తాం
అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానని సీఎం చంద్రబాబునాయడు అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరులో ఆయన పర్యటించారు. పేరూరు ప్రాజెక్ట్ కు నీటిని తరలించే కాల్వకు చంద్రబాబు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పేరూరు ప్రాజెక్ట్ కు నీటిని తరలించే కాల్వకు ‘పరిటాల రవీంద్ర కాల్వ’ గా పేరు పెడతామని చెప్పారు.
నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతపురం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం జరుగుతోందని అన్నారు. అనంతపురం నుంచి కృష్ణపట్నం పోర్టును అనుసంధానం చేస్తూ జాతీయ రహదారిని నిర్మిస్తామని, అనంతపురం నుంచి అమరావతికి నాలుగు వరుసల రహదారిని కూడా నిర్మిస్తామని, ఈ జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చి తీరుతుందని అన్నారు. ప్రపంచంలోని ఐదు అగ్ర నగరాలలో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని అన్నారు.