North Karnataka: కర్ణాటక రెండో రాజధానిగా బెళగావి... కీలక నిర్ణయం తీసుకోనున్న కుమారస్వామి!
- ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్
- నష్ట నివారణా చర్యలు ప్రారంభించిన కుమారస్వామి
- ఎస్వీఎస్ లోకి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు
- హామీ ఇచ్చిన కర్ణాటక సీఎం
ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని నిరసనలు మిన్నంటుతున్న వేళ, నష్టనివారణా చర్యలకు దిగిన సీఎం కుమారస్వామి సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. నార్త్ కర్ణాటకలోని ప్రధాన పట్టణమైన బెళగావిని రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన ప్రతిపాదించారు. బెళగావిలో ఉన్న సెక్రటేరియేట్ భవనం 'సువర్ణ విధాన సౌధా' లోకి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
కాగా, జేడీ(ఎస్) - బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2006లోనే, బెళగావిని రెండో రాజధానిగా చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో నాగపూర్, జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ మాదిరిగా కన్నడ నాట కూడా రెండు రాజధానుల ఏర్పాటుకు అడుగులు పడ్డా, అవి పన్నెండేళ్లుగా దస్త్రాలకే పరిమితమయ్యాయి. ఇటీవల బెల్గాం ప్రాంతం కర్ణాటకలో భాగమేనని మహాజన్ కమిషన్ రిపోర్టు ఇవ్వడంతో, దాన్ని అమలు చేసే దిశగా కుమారస్వామి ఇప్పుడు అడుగులు వేస్తున్నారు.
"నేను 2006లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ డిమాండ్ పెండింగ్ లో ఉంది. ఆ తరువాతి ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలను పక్కనబెట్టాయి. బెళగావిని రెండో రాజధానిగా ప్రకటించే అంశంపై నేను ఆలోచిస్తున్నా. ఈ విషయమై సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం" అని కుమారస్వామి వెల్లడించారు. కాలాబుర్గి, బెళగావి, హుబ్లీ-ధార్వాడ్ ప్రాంత ప్రజలు ప్రతి విషయానికీ సుదూరంలో ఉన్న బెంగళూరుకు రావడం కష్టమనే విషయాన్ని తాము గుర్తించామని కుమారస్వామి వ్యాఖ్యానించారు.