Hyderabad: చిన్నారి కోసం హైదరాబాద్ డైవర్ట్ అయిన విమానం.. అయినా దక్కని ప్రాణం!
- పాట్నా వెళ్తున్న విమానంలో శిశువుకు అస్వస్థత
- శంషాబాద్‌కు విమానం మళ్లింపు
- అప్పటికే ప్రాణాలొదిలిన చిన్నారి
బెంగళూరు నుంచి పాట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న నాలుగు నెలల చిన్నారి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆ చిన్నారికి వైద్య సాయం అందించేందుకు విమానాన్ని వెంటనే హైదరాబాద్ డైవర్ట్ చేసి శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. వారు ల్యాండింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆ వెంటనే విమానాశ్రయంలోని అపోలో క్లినిక్‌కు తరలించారు. శిశువును పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు.
మంగళవారం ఉదయం 6:09 గంటలకు ఇండిగో విమానం 6ఈ897 బెంగళూరు నుంచి పాట్నాకు బయలుదేరింది. ఇదే విమానంలో సందీప్ కుమార్-పునీతా శర్మ దంపతులు తమ నాలుగేళ్ల చిన్నారితో ప్రయాణిస్తున్నారు. సరిగ్గా గంటన్నర ప్రయాణం తర్వాత చిన్నారి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు వెంటనే విషయాన్ని విమాన సిబ్బందికి తెలియజేశారు.
దాంతో వారు హైదరాబాద్ విమానాశ్రయ అధికారులకు విషయం చెప్పి ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. విమానం ల్యాండింగ్ కావడానికి ముందే శిశువుకు వైద్యం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. విమానం ల్యాండ్ కాగానే చిన్నారిని అంబులెన్స్‌లోకి తరలించి అపోలో క్లినిక్‌కు తరలించారు. అయితే, అప్పటికే శిశువు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.