kurnool: కర్నూలులో బాంబు పేలుడు.. జంపాల సోదరుల దుర్మరణం!

  • కర్నూలులో మంచి పేరు కలిగిన జంపాల కుటుంబం 
  • ఇటీవల కొన్న భూమిని సర్వే చేయిస్తుండగా పేలుడు 
  • కుటుంబసభ్యులను పరామర్శించిన కోట్ల, ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు శివార్లలో సంభవించిన బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తలు దుర్మరణం పాలయ్యారు. నగర శివార్లలో రహదారి పక్కన ఉన్న పొలాల్లో ఈ మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్, జంపాల శ్రీనివాసులు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో జంపాల కుటుంబానికి మంచి పేరు ఉంది. మల్లికార్జున, రాజశేఖర్ ఇద్దరూ భవన నిర్మాణ రంగంలో ఉంటూ, నగరంలో ఎన్నో భవనాలను నిర్మించారు. తాజాగా కర్నూలు శివార్లలో రూ. 20 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని ఈరోజు సర్వే చేయించారు. ఈ పని నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే ఏఎస్ఐ జంపాల శ్రీనివాసులు, సర్వే డిపార్ట్ మెంట్ డ్రైవర్ సుధాకర్ అక్కడకు వచ్చారు.

భూమిని సర్వే చేయిస్తున్న సమయంలో కూలీలు చెత్తను ఒకచోట పోగుచేసి, నిప్పు పెట్టారు. దీంతో, ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో మల్లికార్జున, రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాసులు, సుధాకర్ లను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసులు ప్రాణం వదిలారు. సుధాకర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలులో కలకలం రేపింది. జంపాల కుటుంబీకులు అందరితోనూ మంచిగా ఉండేవారని స్థానికులు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.

మరోవైపు, డీఎస్పీ యుగంధర్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. ఎవరైనా బాంబులను అక్కడ దాచారా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తును చేపట్టారు. 

  • Loading...

More Telugu News