amar singh: మోదీ, యోగిలకు మద్దతిస్తారా? లేక మేనత్త, పిల్లగాడికి మద్దతిస్తారా?.. మీరే నిర్ణయించుకోండి: అమర్ సింగ్

  • యూపీలో కాంగ్రెస్ పార్టీ లేదు
  • ఎస్పీ, బీఎస్పీలు కుల రాజకీయాలు చేస్తున్నాయి
  • మోదీకి మద్దతు ఇవ్వడానికే తాను ఇష్టపడతా

సమాజ్ వాది పార్టీ, బీఎస్పీలపై అమర్ సింగ్ మండిపడ్డారు. ఆ పార్టీలను కుల పార్టీలుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లకు మద్దతివ్వడానికే తాను ఇష్టపడతానని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలతో తెరచాటున ఎవరు మంతనాలు జరుపుతారో అమర్ సింగ్ కు బాగా తెలుసని ప్రధాని మోదీ చెప్పిన మరుసటి రోజే అమర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

లక్నోలో నిన్న కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, విపక్షాలపై విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా తాను ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియలిస్టులతో తెరచాటు మంతనాలు ఎవరు చేస్తారో అమర్ సింగ్ కు బాగా తెలుసని, అక్కడే వున్న అమర్ సింగ్ ను చూపిస్తూ మోదీ అన్నారు.

ఈ సందర్భంగా అమర్ సింగ్ మాట్లాడుతూ, తాను స్వచ్ఛమైన రాజకీయాలనే నమ్ముతానని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేదని... ఆ పార్టీ ఉనికి చాలా చిన్నదని అన్నారు. ఎస్పీ, బీఎస్పీ రెండూ ఒక నాణేనికి రెండు వైపుల్లాంటివని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు కుల రాజకీయాలను నడుపుతున్నాయని మండిపడ్డారు. సెక్యులరిజం అంటే ఒక కులమే అనే భావనలో ఉంటాయని విమర్శించారు.

ప్రధాని మోదీ, సీఎం యోగికి మద్దతుగా ఉంటారో? లేదా బబువా (మేనత్త), బువా (పిల్లగాడు)కు మద్దతుగా ఉంటారో? యూపీ ప్రజలే తేల్చుకోవాలని అమర్ సింగ్ అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తరచుగా మేనత్త అంటూ పిలుస్తుంటారు. ఎస్పీ తరపున రాజ్యసభకు ఎంపికైన అమర్ సింగ్ ను... గత ఏడాది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 

  • Loading...

More Telugu News