Maneka Gandhi: హిజ్రాలను ఇతరులుగా పేర్కొంటూ చిన్నగా నవ్విన కేంద్రమంత్రి మేనక.. విమర్శలతో క్షమాపణ
- హిజ్రాలను ఇతరులుగా పేర్కొంటూ సభలో నవ్వాపుకున్న మేనక
- హిజ్రా కమ్యూనిటీ నుంచి విమర్శలు
- సభకు క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి
హిజ్రాలను ‘ఇతరులు’గా పేర్కొన్న కేంద్రమంత్రి మేనకా గాంధీ క్షమాపణలు తెలిపారు. ఆ పదం ఉపయోగించినందుకు తనను క్షమించాలని కోరారు. అవగాహన లేకే అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. మనుషుల అక్రమ రవాణాను స్కూలు పాఠ్యాంశాల్లో భాగంగా చేసే విషయం గురించి గురువారం లోక్‌సభలో మాట్లాడిన మేనకా గాంధీ హిజ్రాలను ‘ఇతరులు’గా పేర్కొంటూ నవ్వు ఆపుకునేందుకు ప్రయత్నించారు.
ఆమె వ్యాఖ్యలపై హిజ్రాల సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ మంత్రి అయి ఉండీ అలా మాట్లాడుతూ నవ్వడమేంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ‘నేషనల్ అలయెన్స్ ఫర్ మూమెంట్స్ అండ్ ట్రాన్స్ విమెన్’ సభ్యురాలు మీరా సంఘమిత్ర మాట్లాడుతూ హిజ్రాలను అవమానించినందుకు మంత్రి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో మేనక స్పందించారు. సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చి క్షమాపణలు వేడుకున్నారు. తాను నవ్వును ఆపుకోలేదని, నవ్వలేదని స్పష్టం చేశారు. హిజ్రాలను ఇతరులుగా పేర్కొని బాధపెట్టినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నట్టు చెప్పారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ గురించి సరైన పదజాలం తెలియకే అలా మాట్లాడాల్సి వచ్చిందని సభకు తెలిపారు.