Karnataka: ఉత్తర కర్ణాటకలో టెన్షన్ టెన్షన్.. నేడు ప్రత్యేక రాష్ట్ర జెండా ఆవిష్కరణ

  • పసుపు, ఆకుపచ్చ, కాషాయం రంగుల్లో జెండా
  • ప్రభుత్వం అడ్డుకున్నా ఆవిష్కరించి తీరుతామని ప్రకటన
  • సీఎం కుమారస్వామిపై యడ్యూరప్ప ఫైర్

కర్ణాటకలోని 13 జిల్లాలను విడగొట్టి ఉత్తర కర్ణాటక పేరిట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరింత ఊపందుకుంది. తాజాగా ప్రత్యేక రాష్ట్రం కోరుతున్న‘ఉత్తర కర్ణాటక హోరాట సమితి’ నేడు బెళగావిలో ప్రత్యేక రాష్ట్ర జెండాను ఆవిష్కరించనుంది. ప్రభుత్వం తమను అడ్డుకున్నా సరే జెండాను ఆవిష్కరించి తీరుతామని సమితి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ జెండాను పసుపు, ఆకుపచ్చ, కాషాయం రంగుల్లో రూపొందించారు. జెండా మధ్యలో ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాల పటాన్ని ముద్రించారు.


ఉత్తర కర్ణాటక ఏర్పాటుకు తొలుత మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆయా పార్టీల అధిష్ఠానాలు కన్నెర్ర చేయడంతో వెనక్కి తగ్గారు. మరోవైపు బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ.. నిజంగా ఉత్తర కర్ణాటక ప్రజలు అభివృద్ధిని కోరుకుని ఉంటే తన పార్టీ జేడీఎస్ కే ఓటు వేసేవారని సీఎం కుమారస్వామి చెప్పడం దారుణమన్నారు. దీనివల్లే ఉత్తర కర్ణాటక ప్రజల్లో ఆగ్రహం బయల్దేరిందన్నారు.


అయితే మీడియానే ప్రత్యేక రాష్ట్రం పేరిట ఉత్తర కర్ణాటక ప్రజల్ని రెచ్చగొడుతోందని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. కాగా, ఉత్తర కర్ణాటక ప్రాంతానికి పదవుల పంపకం, అభివృద్ధి, నిధుల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇస్తే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వెనక్కు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కర్ణాటక హోరాట సమితి చీఫ్ భీమప్ప గదద్ తెలిపారు.

  • Loading...

More Telugu News