Telangana: వచ్చే ఖరీఫ్ లో ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలి: తెలంగాణ సీఎస్ ఆదేశాలు

- ధాన్యం కొనుగోలుకు తగు ప్రణాళిక రూపొందించాలి
- ధాన్యం విక్రయించే ప్రతి ఒక్క రైతు వివరాలు ఉండాలి
- అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించే ధాన్యం కొనుగోలుకు తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. హైదరాబాదులోని సచివాలయంలో ఈరోజు పౌరసరఫరాల శాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ తో పాటు ఏసు రత్నం, ప్రసాద్, చంద్రప్రకాశ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, వచ్చే ఖరీఫ్ లో ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ధాన్యం విక్రయించే ప్రతి ఒక్క రైతు వివరాలు ఉండాలని, కొనుగోలు కేంద్రాల నుండి గోడౌన్ లకు అయ్యే రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా కృషి చేయాలని సూచించారు.
2018-19 ఖరీఫ్ లో దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అవసరమైన గన్నీ బ్యాగులు, స్టోరేజ్ సౌకర్యం ఏర్పాటు దిశగా దృష్టి సారించాలని, రైతులకు ఆన్ లైన్ పద్ధతిలో చెల్లింపులు జరుగుతున్నాయని, 2016 ఖరీఫ్, 2017 రబీ, ఖరీఫ్, 2018 రబీ సీజన్ లలో 107.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 22.18 లక్షల రైతుల నుండి సేకరించి 16,691 కోట్ల రూపాయలను వారి ఖాతాలకు బదిలీ చేయడం జరిగినట్టు చెప్పారు.
కాగా, పౌరసరఫరాల శాఖ ద్వారా వచ్చే ఖరీఫ్ ధాన్య సేకరణకు సిద్ధంగా ఉన్నామని, జీపీఎస్ ద్వారా రవాణా కార్యకలాపాలను, సీసీ టివీల ద్వారా గోడౌన్స్ ను పర్యవేక్షిస్తున్నామని తదితర అంశాలపై అకున్ సభర్వాల్ వివరించారు. 2014 నుండి ఇప్పటివరకు 10,331, 6ఏ కేసులు బుక్ చేశామని తెలిపారు. తూనికల కొలతల ద్వారా 2014 నుండి ఇప్పటి వరకు 49.38 కోట్ల స్టాంపింగ్ ఫీ, 24.56 కోట్ల కాంఫౌండ్ ఫీ గా నమోదు చేశామని, 57 వేల కేసులు బుక్ చేశామని, ఎప్పటికప్పుడు ప్రత్యేక రైడ్స్ చేపడుతున్నట్లు సీఎస్ కు అకున్ సబర్వాల్ వివరించారు.