ambati rambabu: జగన్ అలా అనలేదు.. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి రాంబాబు
- రిజర్వేషన్లు ఇవ్వడం రాష్ట్ర పరిధిలో లేదని మాత్రమే జగన్ చెప్పారు
- కాపు రిజర్వేషన్లకు వైసీపీ వ్యతిరేకం కాదు
- ముద్రగడ చేసిన వ్యాఖ్యలు బాధించాయి
కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తమ అధినేత జగన్ మాట్లాడలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన చెప్పారు. రాజకీయపరంగా లబ్ధి పొందేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం రాష్ట్ర పరిధిలో లేదని మాత్రమే జగన్ చెప్పారని అన్నారు. కాపు రిజర్వేషన్లకు వైసీపీ వ్యతిరేకం కాదని, ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పారు. ఒక్కసారి హామీ ఇస్తే... వెనక్కి తీసుకునే తత్వం జగన్ ది కాదని అన్నారు.
జగన్ ను ఉద్దేశించి కాపు నేత ముద్రగడ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అంబటి చెప్పారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబును ఏం చేశారని ప్రశ్నించారు. ఈరోజు వరకు కాపు రిజర్వేషన్ల అంశం పెండింగ్ లోనే ఉందని చెప్పారు. ముద్రగడ ఆమరణ దీక్షకు దిగితే... తలుపులు పగలగొట్టి, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు లాక్కెళ్లారని... ఆ సమయంలో ముద్రగడకు అండగా ఉన్నది జగనేనని గుర్తుచేశారు. కాపు ఉద్యమానికి అండగా ఉన్న పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పారు.