vh: జోగిని శ్యామల పెట్టిన శాపం ప్రభుత్వానికి మంచిది కాదు: వీహెచ్

  • గతంలో జోగినిలు చెప్పినవి నిజమయ్యాయి
  • కవిత బోనం ఎత్తుకుంటేనే బోనాల పండగా?
  • కేసీఆర్ నియంతృత్వ పాలన ముగియక తప్పదు

ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లు సరిగా లేవంటూ జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జోగిని శ్యామల పెట్టిన శాపం ప్రభుత్వానికి మంచిది కాదని, గతంలో జోగినిలు చెప్పినవి నిజమయ్యాయని అన్నారు. 

తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలనే జోగిని శ్యామల ప్రస్తావించిందని అన్నారు. కవిత బోనం ఎత్తుకుంటేనే బోనాల పండగ అన్నట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోందని వీహెచ్ మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన ముగియక తప్పదని అన్నారు. కేసీఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను అణగదొక్కాలని చూస్తోందని, బీసీలకు తాయిలాలే తప్ప రాజకీయంగా న్యాయం చేయడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే ఫలితాలు ఉండగా, మళ్లీ బీసీ గణన ఎందుకని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ముఖ్యమని, ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న విషయాన్ని అధిష్ఠానం నిర్ణయిస్తుందని వీహెచ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్న భయంతోనే ఈ ఎన్నికలను వాయిదా వేస్తోందని విమర్శించారు. అధికారులకు పదవీ కాలాన్ని పొడిగిస్తున్న సీఎం కేసీఆర్, సర్పంచ్ లకు అధికారాలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక అధికారులపై సర్పంచ్ లు తిరగబడాలని..వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వీహెచ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News