Atmakur: టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఆత్మకూరు నేత కన్నబాబు... పార్టీ కార్యాలయంలో నిరసన!
- వేడెక్కిన ఆత్మకూరు రాజకీయం
- 2014లో ఓటమి పాలైన కన్నబాబు
- ఆదాలకు ఇన్ చార్జ్ బాధ్యతలు ఇవ్వడంపై ఆగ్రహం
నెల్లూరు జిల్లా ఆత్మకూరు రాజకీయం మరోసారి వేడెక్కింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కన్నబాబు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించిన తరువాత వర్గపోరు తారస్థాయికి చేరగా, తాజాగా పార్టీ కార్యాలయంలో కన్నబాబు, తన అనుచరులతో కలసి దీక్షకు దిగడంతో పరిస్థితి విషమించింది. ఇటీవలి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, పి. నారాయణలు ఆత్మకూరు గురించి చర్చించిన తరువాత ఆదాల నియామకాన్ని ఖరారు చేయగా, పార్టీ నిర్ణయాన్ని కన్నబాబు తీవ్రంగా వ్యతిరేకించారు.
నిన్న టీడీపీ కార్యాలయాన్ని తన అధీనంలోకి తీసుకున్న కన్నబాబు, నేడు రెండో రోజూ దీక్షను కొనసాగిస్తుండటంతో పోలీసులు బందోబస్తును పెంచారు. పార్టీ నేతలు అత్మకూరును పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కాగా, కన్నబాబు అనుచరులంతా పార్టీకి రాజీనామా చేద్దామని సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకు లభించదన్న సంకేతాలు అందిన తరువాతే కన్నబాబు తన నిరసనను ఇలా తెలియజేస్తున్నట్టు సమాచారం.