raghuveera reddy: రాహుల్ తోను, నాతోనూ చిరంజీవి మాట్లాడారు: రఘువీరారెడ్డి
- ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి చిరంజీవి ప్రచారం చేస్తారు
- మోదీతో జగన్ అంటకాగుతున్నారు
- వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ప్రచారం చేస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. తమ అధినేత రాహుల్ గాంధీతోను, తనతోను చిరంజీవి మాట్లాడారని... ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి ప్రచారం చేస్తానని చెప్పారని తెలిపారు. ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడే హక్కు తమకు లేదని... అంతా హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.
బీజేపీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం పెట్టుకున్న పార్టీలతో తాము చేయి కలపబోమని అన్నారు. నూటికి నూరు శాతం ప్రధాని మోదీతో జగన్ అంటకాగుతున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ విషయంలో తమకు ఇంకా పూర్తి క్లారిటీ రాలేదని, జనసేన గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జగన్ పార్టీ, పవన్ పార్టీలు బరిలోకి దిగితే... ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని తాము నిర్ణయిస్తామని తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.