Rajasthan: తండ్రికి అంత్యక్రియలు చేశారన్న ఆగ్రహంతో.. నలుగురు కుమార్తెల వెలి.. రాజస్తాన్ లో ఖాప్ పంచాయితీ నిర్వాకం!
- రాజస్తాన్ లోని కోట ప్రాంతంలో ఘటన
- తండ్రి చివరి కోరిక మేరకు అంత్యక్రియలు నిర్వహించిన నలుగురు కుమార్తెలు
- వెలి వేయలేదని వివరణ ఇచ్చిన కులపెద్ద
తండ్రి చివరి కోరికను తీర్చడమే వారి పాలిట శాపంగా మారింది. కుల పెద్దల హెచ్చరికల్ని కాదని తండ్రి అంత్యక్రియల్ని నిర్వహించిన నలుగురు కుమార్తెలను, ఆ కుటుంబాన్ని ఖాప్ పంచాయితీ వెలివేసింది. ఈ ఘటన రాజస్తాన్ లోని బుండీ జిల్లాలో చోటుచేసుకుంది.
కోట పట్టణానికి సమీపంలోని బార్లి బుండీ రాజెర్ కాలనీలో ఉంటున్న దుర్గాశంకర్(58) అనే టైలర్ శనివారం రాత్రి కన్నుమూశాడు. ఇంట్లో మగ సంతానం లేకపోవడంతో తండ్రి చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు చేసేందుకు నలుగురు కుమార్తెలు ముందుకొచ్చారు. దీనిపై రాజెర్ కుల పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నలుగురు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. అయినా సరే కుమార్తెలు వెనక్కి తగ్గకుండా అంత్యక్రియల్లో పాల్గొనడంతో నలుగురితో పాటు మిగతా కుటుంబ సభ్యుల్ని వెలేస్తున్నట్లు ఖాప్ పంచాయితీ కుల పెద్దలు ప్రకటించారు.
ఈ విషయమై దుర్గాశంకర్ పెద్ద కుమార్తె మీనా మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి అంత్యక్రియల అనంతరం అక్కడ స్నానం చేసే ప్రాంతాన్ని తాము వాడుకోకుండా కులపెద్దలు తాళం వేశారని ఆరోపించింది. దుర్ఘటన తర్వాత ఇరుగుపొరుగువారు ఎవ్వరూ తమకు భోజనం పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది చదువుకున్న కులస్తులు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారని ఆమె తెలిపింది.
కాగా, ఈ విషయమై కులపెద్ద చందూలాల్ స్పందిస్తూ.. బయటివారు తమపై తప్పుడు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. బుండీలో ఎలాంటి వెలివేత చోటుచేసుకోలేదని ప్రకటించారు. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన నలుగురు యువతుల్ని ఆయన ప్రశంసించారు.