karunanidhi: విషమించిన కరుణానిధి ఆరోగ్యం.. సేలం నుంచి అర్థాంతరంగా చెన్నైకి సీఎం!

  • చికిత్స కొనసాగుతోందన్న వైద్యులు 
  • కార్యకర్తలు సంయమనం పాటించాలన్న ఎ.రాజా
  • ఆసుపత్రి వద్ద భారీ భద్రత

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించింది. ఆదివారం రాత్రి 9:50 గంటలకు బులెటిన్ విడుదల చేసిన కావేరీ ఆసుపత్రి వైద్యులు కరుణ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు చెప్పారు. చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. మరోవైపు, ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడే ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు, అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిసిన వెంటనే సేలంలో అధికారిక పర్యటనలో ఉన్న సీఎం పళనిస్వామి అర్థాంతరంగా తన పర్యటనను వాయిదా వేసుకుని చెన్నై వచ్చేశారు. ఏదో జరిగిపోతోందన్న భావనతో వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చి ఆసుపత్రిని చుట్టుముట్టారు. గుండెలు బాదుకుంటూ రోదించారు. తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆసుపత్రితోపాటు డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని పోలీస్ స్టేషన్లకు హెచ్చరికలు పంపారు.

రాత్రి 10:30 గంటల సమయంలో కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా విలేకరులతో మాట్లాడారు. కరుణానిధి ఆరోగ్యం కొంతసేపు క్షీణించిన మాట వాస్తవమేనని, అయితే, ఆ తర్వాత చికిత్సకు స్పందించి కోలుకున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు వదంతులు నమ్మవద్దని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News