Sujana Chowdary: అసలు ఏపీని కేంద్రం ఏం చేయదలచుకుంది?: సుజనా చౌదరి

  • స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఎందుకు నిర్ణయం తీసుకోరు?  
  • కేంద్రం గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోంది
  • రైల్వేజోన్ పై నిర్ణయం తీసుకోలేని కేంద్రం దేశాన్ని ఎలా పాలిస్తుంది?

ఏపీకి రైల్వేజోన్ సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మరోసారి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని కేంద్రం చెప్పడం సబబు కాదని అన్నారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు ఇస్రో అభ్యంతరం చెప్పడంతో మరో పోర్టు ఇస్తామని చెప్పిన కేంద్రం, ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్త లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ రైల్వేజోన్ పై నిర్ణయం తీసుకోలేని కేంద్రం దేశాన్ని ఎలా పాలిస్తుంది? అని ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చాక యూసీలు కావాలని కేంద్రం అడుగుతోందని, అసలు, ఏపీని కేంద్రం ఏం చేయదలచుకుంది? అని సుజనా చౌదరి నిలదీశారు. 'ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? స్టీల్ ప్లాంట్ పై టాస్క్ ఫోర్స్ నివేదిక కూడా సానుకూలంగానే ఉందని అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోంది' అని దుయ్యబట్టారు.

పార్లమెంట్ సాక్షిగా ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని చెప్పి మాట తప్పారని, నాలుగు డివిజన్స్ ఉండి కూడా జోన్ లేని రాష్ట్రం ఏపీ అంటూ కేంద్రంపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. దేశాన్ని పాలించే నేతలు రోజుకో మాట చెబితే ఎలా? అని ప్రశ్నించారు. రాజకీయ పక్షపాత ధోరణి వల్లే విశాఖ రైల్వే జోన్ ఇవ్వట్లేదని, ఏపీ చిరకాల స్వప్నం అయిన రైల్వేజోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రానికి కనికరం లేదని, పదవులు శాశ్వతం కాదని.. ప్రజల మనోభావాలు ముఖ్యమని అన్నారు. ఆగస్టు 1న కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంపై పార్లమెంట్ లో నిరసన తెలుపుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News