modi: ఏపీకి ప్రధాని మోదీ ప్రధాన అడ్డంకిగా తయారయ్యారు: కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ

  • ఆంధ్రులను మోదీ నయవంచన చేశారు
  • విశాఖ రైల్వేజోన్‌ సాధ్యం కాదనడం దారుణం
  • కన్నా ఏపీ పౌరుడా? మోదీ తరపు న్యాయవాదా?

నవ్యాంధ్రప్రదేశ్‌ అభ్యున్నతికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రధాన అడ్డంకిగా తయారయ్యారని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆరోపించారు. ఈ మేరకు  ఓ ప్రకటన విడుదల చేశారు. నాలుగున్నరేళ్లుగా ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోదీ నయవంచనకు గురిచేశారని, వివక్ష చూపుతూ ఆంధ్రుల భవితవ్యంతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌ పట్ల మోదీ సర్కారు చూపుతున్న వివక్ష, కక్ష పూరిత వైఖరి సుప్రీం కోర్టు సాక్షిగా మరోమారు బట్టబయలైందని అన్నారు. హోం మంత్రి రాజనాథ్‌సింగ్‌ విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేసి తీరతామని ఇటీవల చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదే హోంశాఖ సుప్రీంకోర్టుకు తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో విశాఖలో రైల్వే జోన్‌ సాధ్యం కాదని తేల్చి చెప్పడం దారుణమని, పైపెచ్చు పదో షెడ్యూలులో సంస్థలను విభజించాల్సిన అవసరం లేదని పేర్కొందని, ఇంతకన్నా దారుణం మరోటి లేదని అన్నారు.

పదో షెడ్యూలులోని ఉన్నత విద్యామండలిని ఆస్తులను, అప్పులను జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాల మధ్య విభజించాలన్న సుప్రీం తీర్పును అమలు చేయకుండా మోదీ సర్కారు తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కొమ్ము కాస్తోందని, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు అడ్డు పుల్లలు వేస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులు, ప్రాజెక్టుల విషయమై కోర్టుకు సైతం అవాస్తవాలను ఫైల్‌ చేసిందని, పైపెచ్చు బాధ్యతలను విస్మరించి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు గొడవపడుతున్నందునే విభజన చట్టం అమలు చేయడం సాధ్యం కాదని కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చిందని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీతో లోపాయికారీ అవగాహనకొచ్చి ఆంధ్రప్రదేశ్‌పై ఉసిగొల్పుతోందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భుజాలపై నుంచి ఆంధ్రులపై తుపాకీ ఎక్కుపెట్టిందని, విభజన చట్టం అమలు చేయకుండా మోదీ సర్కారు అవలంబిస్తున్న దుర్నీతికి సుప్రీంకోర్టుకు వరుసగా సమర్పిస్తున్న అఫిడవిట్‌లే నిదర్శనమని అన్నారు. దీనిపై ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు సహా ఇతర నాయకులు ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఏం సమాధానం చెబుతారు? సిగ్గులేకుండా కొంతమంది ఆ పార్టీ నాయకులు రైల్వేజోన్‌ ఇస్తామని చెప్పినందుకు రాజ్‌నాథ్‌సింగ్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి ఢిల్లీకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లారు? అని ప్రశ్నించారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ 2014 ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వలేదని, వీడియోలను మార్ఫింగ్‌ చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ పౌరుడిగా కాకుండా మోదీ తరఫున వకాల్తా పుచ్చుకున్న న్యాయవాదిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఆయన దిగజారుడు తనానికి ఇది నిదర్శనం అన్నారు. మోదీ చేసిన వాగ్దానాలకు ఆ తిరుపతి వేంకటేశ్వరస్వామే సాక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయానికి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, కేంద్రంలోని మోదీ సర్కారు పతనమై మళ్లీ కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం, విభజన చట్టం అమలు చేయడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం తథ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News