Jagan: ప్రజలను మభ్యపెట్టకూడదనే జగన్ తన అభిప్రాయం చెప్పారు: వైసీపీ నేత బొత్స

  • కాపు రిజర్వేషన్లపై తాము ఇప్పటికీ వ్యతిరేకం కాదు
  • కాపులను ఎప్పటికీ జగన్ మోసం చేయరు
  • మోసపూరిత హామీలివ్వడం వైసీపీ విధానం కాదు

కాపు రిజర్వేషన్లపై తాము ఇప్పటికీ వ్యతిరేకం కాదని, ఈ అంశంపై ప్రజలను మభ్యపెట్టకూడదనే జగన్ తన అభిప్రాయం చెప్పారని, కాపులను ఎప్పటికీ జగన్ మోసం చేయరని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ ఉన్నది ఉన్నట్టు చెప్పారని.. చంద్రబాబులా హామీ లిచ్చి మోసం చేయలేమని అన్నారు.

కాపు రిజర్వేషన్లపై టీడీపీ తీర్మానం చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని అన్నారు. కాపు రిజర్వేషన్లపై తమ పార్టీ విధానాన్ని జగన్ ప్రకటించారని, మోసపూరిత హామీలివ్వడం వైసీపీ విధానం కాదని అన్నారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను నాలుగేళ్లపాటు మోసం చేసి ఓట్లు కాజేసిన చరిత్ర టీడీపీదని మండిపడ్డారు. 

ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలను కూడా నెరవేర్చలేరా? అని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్ కుదరదని చెబుతుంటే, చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కోమాట చెబుతున్నారని విమర్శించారు. ఇలానే వ్యవహరిస్తే ఏపీలో ‘కాంగ్రెస్’కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు. చంద్రబాబు రెండెకరాల నుంచి రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారు? పంచభూతాలను దోచేస్తూ నీతులు చెబుతారా? టీడీపీ, బీజేపీ రెండూ తోడుదొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు పదవులు త్యాగం చేశారని, ‘హోదా’ కోసం టీడీపీ ఎంపీలు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ‘హోదా’ కోసం ప్రాణాలు తీసుకున్న చేనేత కార్మికుడు సుధాకర్ ది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్ ఆ తర్వాత కనిపించకుండా పోయారని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కల్యాణ్ ప్రవచనాలు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడానికి కారణాలను పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబు చేస్తోంది తప్పని పవన్ ఒక్కసారైనా ప్రశ్నించారా? అని అన్నారు.

  • Loading...

More Telugu News