upputeru: ఉప్పుటేరు వాగు కలుషితం కాకుండా చూసుకుంటాం: మంత్రి పితాని
- ఆక్వా ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం
- రైతు సమస్యలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తాం
- పరిశ్రమలు రావాలి.. భూములు కలుషితం కాకూడదు
ఉప్పుటేరు వాగు కలుషితం కాకుండా చూసుకుంటామని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఆక్వా ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబునాయుడుతో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని.. భూములు మాత్రం కలుషితం కాకూడదని అన్నారు.
టీడీపీ ఎంపీ మాగంటి బాబు, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉప్పుటేరు జలాలను కలుషితం కానివ్వమని, ఆక్వా పరిశ్రమకు అనుమతి ఇవ్వమని చెప్పారు. ఆక్వా వ్యర్థాలను పైపుల ద్వారా సముద్రంలోకి వదలాలని, ఇందుకు ఆక్వా యజమానులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. చేపల చెరువుల్లోకి, తాగునీటి కాలువల్లోకి ఈ వ్యర్థాలను వదిలితే కఠిన చర్యలు తప్పవని, ఉప్పుటేరు వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
కాగా, ఉప్పుటేరు వాగుపై ఆక్వా పరిశ్రమ ఏర్పాటును కైకలూరు, కలిదిండి, కృత్తివెన్ను మండలాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆక్వా వ్యర్థాలను ఉప్పుటేరులో కలిపితే తుందుర్రు తరహా ఉద్యమాన్ని చేపడతామని మూడు మండలాల ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.