Anantapur District: ప్రియుడి కోసం భర్తను హత్య చేయించాలని ప్రయత్నించిన భార్య... భగ్నం చేసిన పోలీసులు!

  • అనంతపురం జిల్లాలో ఘటన
  • ఏడాది క్రితం రాంగ్ కాల్ తో ఏర్పడిన పరిచయం 
  • హత్య కోసం ఆరుగురు రౌడీలతో డీల్

ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయాలని ఓ భార్య పథకం వేయగా, పోలీసులు తమకు అందిన సమాచారంతో వాహనాల తనిఖీ చేపట్టి, భార్య ప్లాన్ ను బెడిసికొట్టేలా చేసిన ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఓ వివాహిత యువతికి సంవత్సరం క్రితం కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కోటేశ్వరరావు నుంచి రాంగ్ కాల్ రాగా, అప్పుడు ఏర్పడిన వారి పరిచయం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది. కర్నూలు నుంచి తరచూ అనంతపురంకు వచ్చే కోటేశ్వరరావు ఆమెను కలిసి వెళుతుండేవాడు.

తన సంబంధంపై భర్తకు అనుమానం రాకుండా జాగ్రత్త పడిన ఆమె, ఇక ప్రియుడిని వదిలి ఉండలేక భర్తను హత్య చేయాలని పథకం వేసింది. ఈ క్రమంలో కోటేశ్వరరావు రూ. 2.50 లక్షలతో ఆరుగురు కిరాయి హంతక ముఠాతో బేరం కుదుర్చుకున్నాడు. భర్తను హత్య చేసేందుకు వారు కారులో బయలుదేరి వస్తుండగా, ఈ సమాచారం పోలీసులకు చూచాయగా తెలిసింది.

నార్పల చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా, సదరు భర్త అదృష్టం కొద్దీ కోటేశ్వరరావు సహా ఆరుగురు కిరాయి రౌడీలు పోలీసులకు చిక్కారు. వారి నుంచి వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. తన హత్యకు కుట్ర పన్నారనిగానీ, వారిని పోలీసులు పట్టుకున్నారన్న విషయం గానీ, భార్య వివాహేతర సంబంధం గురించిగానీ బాధిత భర్తకు తెలియదని పోలీసులు వెల్లడించడం గమనార్హం.

Anantapur District
Wrong Call
Extra Marital Affair
Police
Arrest
  • Loading...

More Telugu News