Imran Khan: ముగిసిన పాక్ ఎన్నికల కౌంటింగ్... తుది ఫలితాల వివరాలు!
- ఇమ్రాన్ ఖాన్ కు 116 స్థానాలు
- మెజారిటీకి 21 మంది సభ్యుల దూరం
- చిన్న పార్టీల మద్దతు కోరుతున్న ఖాన్
పాకిస్థాన్ లో గత వారం జరిగిన ఎన్నికల తరువాత, కౌంటింగ్ పూర్తయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 272 స్థానాలకు ఎన్నికలు జరుగగా, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని 'పాకిస్థాన్ తెహ్రీక్ - ఎ - ఇన్సాఫ్' (పీటీఐ) 116 స్థానాలు గెలుచుకుందని ఈసీ పేర్కొంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ - ఎన్ (పీఎంఎల్-ఎన్) 64 చోట్ల గెలిచి రెండో స్థానంలో నిలువగా, బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 43 చోట్ల గెలిచి మూడో స్థానంలో నిలిచింది. మిగతా సీట్లలో అత్యధికం స్వతంత్రులకు దక్కాయి.
ఆధిక్యం చూపాలంటే, 137 స్థానాలు అవసరం కాగా, ఇమ్రాన్ ఖాన్ కు ఇంకా 21 మంది సభ్యుల మద్దతు అవసరం. దీనికోసం ఆయన చిన్న పార్టీల మద్దతును కోరుతున్నారు. కాగా, పాకిస్థాన్ లో దామాషా పద్ధతిలో కేటాయించనున్న 70 సీట్లలో అత్యధికం ఇమ్రాన్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దామాషా సీట్లను కూడా కలిపితే ప్రభుత్వ ఏర్పాటుకు 172 మంది సభ్యుల మద్దతుండాలి. ఈ మద్దతును కూడగట్టేందుకు ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం ఆగస్టు 14 (పాక్ స్వాతంత్ర్య దినోత్సవం)కు అటూ ఇటుగా ఉంటుందని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.