East Godavari District: వచ్చేసిన పులస... కిలో 5 వేలు పలుకుతున్నా కొనేస్తున్న భోజన ప్రియులు!
- ఉభయ గోదావరి జిల్లాల్లో పులసల వేట
- స్థానిక మార్కెట్లలో లభ్యం
- ఎంత రేటైనా కావాల్సిందేనంటున్న ప్రజలు
గోదావరి జిల్లాల మాంసాహార ప్రియులు పులస పేరు చెబితే లొట్టలేసేస్తారు. అందుకే 'పుస్తెలమ్మి అయినా పులస తినాలనే' సామెత ఈ ప్రాంతంలో పుట్టింది. గోదావరి వరద నీరు బంగాళాఖాతంలోకి పారుతున్న వేళ పాయల్లోకి వచ్చే ఈ సీజనల్ చేప ధర చాలా ఎక్కువ. పాయల్లోకి ఈదుతూ వచ్చే పులస చేపలను పట్టుకునే మత్స్యకారులు, వాటికి ఉన్న డిమాండ్ మేరకు మంచి ధరకు అమ్మి డబ్బు చేసుకుంటూ వుంటారు. ఎర్రటి వరద నీటిలో గుడ్లు పెట్టడానికి ఈ పులస చేపలు ఈదుతూ ఎదురు వస్తుంటాయి. ఈ సీజన్ లో మాత్రమే, అది కూడా గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకూ పులసలు లభిస్తాయి.
ఇక ఈ సీజన్ లో కిలో పులస చేపల ధర రూ. 5 వేల వరకూ పలుకుతుండగా, ఖర్చుకు వెనుకాడకుండా మత్స్య ప్రియులు కొనుగోలు చేస్తున్నారు. ఈ చేపలను చెరువుల్లో పెంచడానికి వీలుండదు. ఒడిశా తీరంలోనూ ఇవి లభ్యమవుతున్నా, గోదావరి జిల్లాల్లో లభించే చేపలకే రుచి అధికమని భోజన ప్రియులు చెబుతుంటారు. సముద్రం నుంచి గోదావరిలోకి వచ్చే ఇలస చేప, రెండు రోజుల పాటు ఎదురు ఈదితే పులసగా మారుతుంది. ప్రస్తుతం అంతర్వేది మార్కెట్, సిద్ధాంతం, నరసాపురం, రావులపాలెం తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో ఇవి లభ్యమవుతుండగా, వాటిని కొనుగోలు చేస్తున్న స్థానికులు, దూర ప్రాంతాల్లోని తమ వారికి పంపుతున్నారు.