Chandrababu: చంద్రబాబుగారు! అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా?: పవన్ కల్యాణ్
- బాధ్యతాయుత అభివృద్ధి చేయలేరా?
- ప్రజలు తోలు తీస్తారు..గుర్తుపెట్టుకోండి
- భూదోపిడీపై ప్రజా ఉద్యమాలు చేస్తాం
సమాజంలో కనిపించే దేవుడు రైతు అని, అటువంటి రైతును కన్నీళ్లు పెట్టించి, వారి భూముల నుంచి వాళ్లను బయటకు పంపించి వేయడం చూస్తుంటే తనకు చాలా బాధేస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు’ను విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నాడు చంద్రబాబుతో మాట్లాడినప్పుడు 1,850 ఎకరాల్లోనే రాజధాని నిర్మిస్తామని చెప్పారని, ఆ భూములు కూడా అటవీ ప్రాంతం నుంచి తీసుకోవాలని చర్చ కూడా జరిగిందని అన్నారు. అందుకు భిన్నంగా, ఇప్పుడు రాజధాని కోసం లక్ష ఎకరాలను సేకరిస్తున్నారని మండిపడ్డారు.
'చంద్రబాబు! బాధ్యతాయుత అభివృద్ధి చేయలేరా? అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా? ప్రజలు తోలు తీస్తారు.. గుర్తుపెట్టుకోండి' అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను కదిలించే శక్తి తనలో ఉందని, డబ్బుతో తననెవరూ కొనలేరని అన్నారు. చంద్రబాబు తప్పు చేస్తున్నారని, ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై న్యాయ, రాజకీయ, ప్రజా ఉద్యమాలు చేపడతామని, మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేస్తామని, సీఎం ఇంటి వద్ద కూర్చుంటామని హెచ్చరించారు.
అడ్డగోలుగా భూ సేకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని, పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటే రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని పవన్ హెచ్చరించారు. ‘కేసులు పెడితే ఎదురు తిరగండి, అండగా నేనుంటా’ అంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తానని, ఇప్పుడు మాత్రం ఉద్యమాలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో తనకు పోలీసులు భద్రత కల్పించని విషయాన్ని ప్రస్తావించారు. తాను పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు అలా వ్యవహరించి ఉంటారని అనుకుంటున్నట్టు చెప్పారు.