Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం భూ టెర్రరిజం నడుపుతోందా?: సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ గోపాలగౌడ
- దేశంలో ఏపీ భాగస్వామి కాదా?
- చట్టాలను ఉల్లంఘించి తప్పుకోవచ్చని సీఎం కలలు
- 2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సులో జస్టిస్ గోపాలగౌడ
ఏపీ ప్రభుత్వం భూ టెర్రరిజం నడుపుతోందా? మూడు పంటలు పండే భూమిని రాజధానికి ఎలా సేకరిస్తారని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ గోపాలగౌడ ప్రశ్నించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు’ను విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, జడ్జి గోపాలగౌడ, పలువురు మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాలగౌడ మాట్లాడుతూ, దేశంలో ఏపీ భాగస్వామి కాదా? ఏమైనా ప్రత్యేకరాజ్యమా? అని ఆయన ప్రశ్నించారు.
చట్టాలను ఉల్లంఘించి తప్పుకోవచ్చని సీఎం చంద్రబాబు కలలుగంటున్నారని విమర్శించారు. అంతకుముందు, ప్రముఖ రాజకీయవేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరానికి మించి భూములు తీసుకుంటోందని మండిపడ్డారు. వామపక్ష నేతలు సీపీఎం మధు, సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ, వామపక్షాలు, ‘జనసేన’తో రాజకీయాల్లో మార్పు రావడం ఖాయమని, భూ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే తమపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూదోపిడీపై పవన్ తో కలిసి పోరాటం చేస్తామని అన్నారు.