Telugudesam: పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ వ్యాఖ్యలు దారుణం: రఘువీరా రెడ్డి
- టీడీపీ, వైసీపీలు బీజేపీకి రెండు కళ్లు
- టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉండదు
- నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదు
బీజేపీతో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. బీజేపీకి టీడీపీ, వైసీపీలు రెండు కళ్లలాంటివని విమర్శించారు. ఈ నెల 22న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తీర్మానం చేయడం సంతోషకరమని చెప్పారు. విభజన కారణంగా హైదరాబాదు నుంచి వచ్చే 80 శాతం ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని... అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉందని రాహుల్ చెప్పారని తెలిపారు.
25 ఎంపీ సీట్లను తమ చేతిలో పెడితే ప్రత్యేక హోదాను సాధిస్తామని టీడీపీ, వైసీపీలు చెబుతున్నాయని... 2014లో అన్ని సీట్లను ఆ రెండు పార్టీల చేతిలోనే ఏపీ ప్రజలు పెట్టారని... అయినా, ఆ పార్టీలు చేసిందేమీ లేదని రఘువీరా ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడిస్తున్న విధంగా టీఆర్ఎస్ ఆడుతోందని మండిపడ్డారు. బీజేపీ డ్రామాలో భాగంగానే... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, తెలంగాణకు కూడా ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతోందని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ పై జగన్ వ్యాఖ్యలను రఘువీరా ఖండించారు. రాజకీయాల్లో ఉన్న నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని అన్నారు.