Uttar Pradesh: ముందీ విషయం చెప్పండి.. అఖిలేశ్ నాయకత్వంలో మాయావతి పనిచేస్తారా?: యూపీ సీఎం సూటి ప్రశ్న

  • ఎస్పీ-బీఎస్పీలది బుర్ర తక్కువ సంకీర్ణం
  • రాహుల్ నాయకత్వంలో అఖిలేశ్ పనిచేస్తారా?
  • ఎవరు వచ్చినా యూపీలో బీజేపీని ఏమీ చేయలేరు

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ల మధ్య పరస్పర విరుద్ధ భావాలు ఉన్నాయని, ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయడం కష్టమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 75కు పైగా స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఎస్పీ-బీఎస్పీలు రెండు పరస్పర స్వార్థ ప్రయోజనాలతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. అదో బుర్ర తక్కువ సంకీర్ణమని అభివర్ణించిన ఆయన ఆ రెండు పార్టీలు కలిసి మనగలగడం కష్టమని జోస్యం చెప్పారు. అసలు మొదట మాయావతి విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు.

అఖిలేశ్ నాయకత్వంలో మాయావతి పనిచేస్తారా? అన్నదే ఆ ప్రశ్న అన్నారు. అలాగే, రాహుల్ నాయకత్వంలో అఖిలేశ్ పనిచేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీని చూసి వారు భయపడుతున్నారని, వారి ఉనికిని కాపాడుకునేందుకు ఒకరికొకరు దగ్గరవుతున్నారని యోగి విమర్శించారు. ఎంతమంది కలిసినా యూపీలో వారేమీ చేయలేరని తేల్చి చెప్పారు. ఒకరితో ఒకరు చేతులు కలుపుతున్నా, ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో మరోమారు విజయ ఢంకా మోగిస్తామని యోగి స్పష్టంచేశారు.

Uttar Pradesh
Yogi Adityanath
Akhilesh Yadav
Mayawathi
  • Loading...

More Telugu News