Andhra Pradesh: అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదన్న చిదంబరం.. మరి విభజన చట్టంలో ఎందుకు పెట్టారన్న రామ్మోహన్ నాయుడు!

  • పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో వాడీవేడి  
  • చిదంబరంతో విభేదించిన రామ్మోహన్
  • మౌనం దాల్చిన కేంద్ర మాజీ మంత్రి

అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగ నిబంధనలు వర్తించవన్న హోంశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం చైర్మన్‌, కేంద్రమాజీ మంత్రి పి.చిందబరం వ్యాఖ్యలపై సంఘం సభ్యుడు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. రాజ్యాంగం అంగీకరించదని తెలిసీ చట్టంలో ఎందుకు పెట్టారని నిలదీశారు. ఎంపీ ప్రశ్నకు సమాధానం లేక చిదంబరం మౌనం దాల్చినట్టు సమాచారం. విభజన చట్టం అమలుపై నిర్వహించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

చిదంబరం మాట్లాడుతూ.. అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని, కాబట్టి 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిని 225కు పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ విషయంలో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఏపీ అధికారులు వివరిస్తున్న సమయంలో చిదంబరం జోక్యం చేసుకున్నారు. అందుకు రాజ్యాంగం అనుమతించదని తేల్చి చెప్పారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలు, వాటి అమలు తీరు, ప్రభుత్వంపై అవిశ్వాసానికి గల కారణాలను వివరించారు. కాగా, ఈ సమావేశానికి కేంద్ర శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. వారి వాదనను కూడా కమిటీ నమోదు చేసుకుంది. తదుపరి సమావేశంలో తెలంగాణ అధికారులతో కమిటీ భేటీ కానుంది.

  • Loading...

More Telugu News