ap bhavan: ఏపీ భవన్ వెబ్ సైట్ ప్రారంభం
- 'ఏపీ భవన్.ఇన్' వెబ్ సైట్ ప్రారంభం
- సేవలను మరింత సరళతరం చేసేందుకు ఈ వెబ్ సైట్
- ఈ సేవలపై విస్తృత ప్రచారం కల్పించాలి: ప్రవీణ్ ప్రకాష్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి దేశ రాజధానికి విచ్చేసే ప్రజా ప్రతినిధులు, అధికార, అనధికారులు, ప్రజలకు అవసరమైన సత్వర సేవలు కల్పన లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ భవన్ సేవలను విస్తృత పరుస్తున్నట్లు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించే సంకల్పంతో నూతనంగా రూపొందించిన వెబ్ సైట్ 'ఏపీభవన్.ఇన్' (http://apbhavan.in)ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ భవన్ లోని గురజాడ సమావేశ మందిరంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ప్రకాష్, అదనపు రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్, అధికారులు, సిబ్బంది, మీడియా సమక్షంలో దీనిని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ, సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీకి విచ్చేసే వారికి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం సాధారణ పరిపాలన విభాగం ద్వారా ఆంధ్రప్రదేశ్ భవన్ లో వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సేవలను మరింత సరళతరం చేసేందుకు, ఇక్కడకు విచ్చేసేవారి సమయం వృథా కాకుండా, సమయ పాలనతో నిర్ణీత సమయంలో సమీకృత సేవలు కల్పించే ఆశయంతో ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించామని చెప్పారు. వెబ్ సైట్ సేవలను ప్రజాబాహుళ్యంలోనికి తీసుకు వెళ్లి విస్తృత ప్రచారం కల్పించేందుకు, అధికారులు సిబ్బందితో పాటు మీడియా ప్రధాన భూమిక పోషించాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రస్తావించారు.
ఢిల్లీకి విచ్చేసే వారు తమ ప్రయాణ తేదీ, వసతి వివరాల సమగ్ర సమాచారాన్ని ముందుగా వెబ్ సైట్ లో పొందుపరచాలని, అట్టి సమాచారాన్ని రాష్ట్ర సచివాలయ సాధారణ పరిపాలన విభాగానికి అనుసంధాన పరచి సకాలంలో వసతి, రవాణా సదుపాయం కల్పించి అట్టి వివరాలను ఎస్.ఎం.ఎస్ ద్వారా ముందుగా సదరు అతిథికి తెలియజేస్తామని, వెబ్ సైట్ వివరాలను ఇప్పటికే రాష్ట్ర సచివాలయ అధికారులకు వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులకు లేఖల ద్వారా తెలియచేయడం జరిగిందని చెప్పారు.