Tamilnadu: కరుణానిధి ఇంటికి ప్రముఖుల క్యూ.. ఆందోళనలో అభిమానులు!
- విషమంగా కరుణ ఆరోగ్యం?
- కమల హాసన్, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పరామర్శ
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న స్టాలిన్
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) పరిస్థితి విషమంగా ఉందన్న వార్తల నేపథ్యంలో వైద్యులు స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. జ్వరం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌తో ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని తెలిపారు. ఇటీవలే అస్వస్థతకు గురైన ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారన్న వార్త కలకలం రేపింది. నిజానికి ఆయన ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పలువురు నాయకులు, ప్రముఖులు గురువారం రాత్రి ఆయన నివాసానికి తరలివచ్చారు. అన్నాడీఎంకే నేత, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పలువురు మంత్రులు కరుణ ఇంటికి రావడంతో కరుణ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు రేకెత్తాయి. డీఎంకే నేతలైతే రోజంతా అక్కడే గడిపారు. స్టాలిన్ తండ్రి పక్కనే ఉన్నారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల హాసన్, డీపీఐ నేత తిరుమావళవన్, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్, పలువురు వామపక్ష నేతలు కరుణను పరామర్శించారు.
కరుణ ఆరోగ్యంపై రకరకాల వదంతులు వినిపిస్తుండడంతో ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అయితే, తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను స్టాలిన్ ఖండించారు. మూత్రాశయ నాళంలో ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరంతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఇంట్లోనే వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.