Avan Evan: 'అవన్-ఇవన్' సినిమా కేసులో నటుడు ఆర్యకు హైకోర్టులో ఊరట
- ‘అవన్–ఇవన్’లో దేవాలయాన్ని కించపరిచారని పిటిషన్
- పబ్లిసిటీ కోసమేనన్న ఆర్య తరఫు లాయర్
- కోర్టు హాజరు నుంచి మినహాయింపునిచ్చిన మధురై బెంచ్
తన తాజా చిత్రం ‘అవన్–ఇవన్’లో పురాతన సోరిముత్తు అయ్యనార్ ఆలయాన్ని, ప్రసిద్ధి చెందిన జమీన్ ను కించపరిచేలా చూపారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో నటుడు ఆర్యకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసు విచారణ అంబా సముద్రం కోర్టులో సాగుతుండగా, ఆర్యను కోర్టుకు హాజరు కావాలంటూ న్యాయమూర్తి గతంలో ఆదేశించగా, హైకోర్టు ఊరటనిచ్చింది.
పాళయం కోట్టైకు చెందిన ముత్తురామన్ అనే వ్యక్తి అంబాసముద్రం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, చిత్ర దర్శకుడు బాల, నటుడు ఆర్యపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఆర్య తరఫున మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలుకాగా, అంబాసముద్రం కోర్టులో దాఖలైన పిటిషన్ లో ప్రాథమిక ఆధారాలు లేవని, పబ్లిసిటీ కోసం దాఖలు చేశారని ఆర్య తరఫు న్యాయవాది వాదించారు. కేసును రద్దు చేయాలని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరగా, విచారించిన న్యాయమూర్తి కృష్ణకుమార్ ఈ ఉత్తర్వులిచ్చారు.