Pakistan: ప్రధాని, గవర్నర్ల నివాసాలను హోటళ్లుగా మార్చేస్తా: తొలి ప్రసంగంలోనే ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
- నేనో చిన్న ఇంటిలో ఉంటా
- ప్రధాని నివాసంలో ఉండడం అవమానకరం
- భారత్ ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండడుగులు వేస్తా
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అవతరించిన తర్వాత ఆ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విలాసవంతమైన ప్రధాని నివాసంలో తాను ఉండబోనని, అందులో ఉండడం అవమానకరమని అన్నారు. ప్రధాని ప్యాలెస్‌ను విద్యాసంస్థగా, గవర్నర్ల నివాసాలను హోటళ్లుగానో, డబ్బులు సంపాదించిపెట్టే మరో వెంచర్‌గానో మార్చేస్తానని స్పష్టం చేశారు. దేశ ఆర్థికరంగ బలోపేతం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు.
ప్రధాని పదవిని అధిష్ఠించాక తానో చిన్న ఇంటిలో ఉంటానని పేర్కొన్న ఇమ్రాన్ దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారిస్తానని, ఇకపై ప్రజల కోసం ఖర్చు చేస్తానని అన్నారు. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తానని పేర్కొన్న ఇమ్రాన్.. ఈ విషయంలో భారత్ ఒక అడుగు ముందుకేస్తే తాను రెండడుగులు వేస్తానని స్పష్టం చేశారు.