Pawan Kalyan: నేను లోకేష్ లా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాలేదు: పవన్ కల్యాణ్

  • లోకేష్ లాంటి వారు స్వార్థంతో ఆలోచిస్తారు
  • జగన్ లా నేను కూడా తిట్టగలను
  • కానీ, దాని వల్ల సమస్యలు పరిష్కారం కావు

ఏపీ మంత్రి నారా లోకేష్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో డీఎన్ ఆర్ కళాశాల విద్యార్థులు, భీమవరం, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల జనసైనికులతో పవన్ విడివిడిగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను లోకేష్ లా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకు కోపం వచ్చే పరిస్థితి, మాట్లాడకపోతే ఆంధ్రా వాళ్లు తిట్టే పరిస్థితి ఉన్నప్పుడు తాను రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేసుకున్నారు. మంత్రి లోకేష్ లాంటి వారు ఏ పనికి ఎంతొస్తుంది? అన్న స్వార్థంతో ఆలోచించి పాలసీలు చేస్తారని విమర్శించారు.

రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు తనకు మొదట్లో ధైర్యం చాలలేదని, ధైర్యం కూడగట్టుకోవడానికి దశాబ్ద కాలం పట్టిందని అన్నారు. ఈ సందర్భంగా తనపై వైసీపీ అధినేత జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మరోసారి ఖండించారు. జగన్ లా తాను కూడా తిట్టగలనని, తనకూ బలమైన నోరు ఉందని, గొడవ పెట్టుకోగలను కానీ, దానివల్ల సమస్యలు పరిష్కారం కావని అన్నారు.

వీళ్ల మాటలను ఎందుకు భరిస్తున్నానంటే, కొత్త  తరానికి బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను అందించాలనే ఉద్దేశంతోనే అని చెప్పారు. రాజకీయ నాయకులు చేసే పాలసీల వల్ల సామాన్యుడు ఇబ్బందిపడకూడదని, అందుకే, మరో ఇరవై ఐదేళ్లు తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని పవన్ చెప్పారు.

  • Loading...

More Telugu News