Airport: విమానాశ్రయాల్లో మాయం కానున్న 'బోర్డింగ్ పాస్ పై స్టాంప్'!
- కేంద్రానికి, ఎయిర్ పోర్టుల సీఈఓలకు సీఐఎస్ఎఫ్ లేఖ
- ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు
- క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండటమే కారణం
విమానాశ్రయాలకు వెళ్లిన ప్రయాణికులు తీసుకునే బోర్డింగ్ పాస్ పై చెకింగ్ అనంతరం స్టాంప్ వేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. సెక్యూరిటీ చెక్ తరువాత బోర్డింగ్ పాస్ పై చెకింగ్ పూర్తయినట్టు ఈ స్టాంప్ సూచిస్తుంది. త్వరలోనే బోర్టింగ్ పాస్ పై స్టాంప్ వేసే విధానాన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి. విమానాశ్రయాల భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
దేశవాళీ ప్రయాణికులకు తొలుత ఈ సదుపాయాన్ని తీసుకు రావాలని, పైలట్ ప్రాజెక్టుగా ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో అమలు చేయాలని సీఐఎస్ఎఫ్ సిఫార్సు చేసింది. కాగా, ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చెకిన్ బ్యాగ్ లపై స్టాంప్ వేసే విధానాన్ని తొలగించి సత్ఫలితాలు పొందిన సంగతి తెలిసిందే. ఇదే విధానం ప్రస్తుతం చాలా విమానాశ్రయాల్లో అమలవుతోంది. ఎయిర్ పోర్టుల వద్ద సెక్యూరిటీ పెరగడం, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే ప్రయాణికులు లోనికి వెళ్లే అవకాశాలు ఉండటంతో, బోర్టింగ్ పాస్ పై స్టాంపులు అక్కర్లేదన్న ఆలోచనకు సీఐఎస్ఎఫ్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు సీఐఎస్ఎఫ్ హెడ్ (ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ విభాగం) ఎంఏ గణపతి, ఈనెల 18న ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్ పోర్టుల సీఈఓలకు, ఏఏఐకి లేఖ రాశారు. అతి త్వరలోనే ఈ విషయంలో పైలట్ ప్రాజెక్టు మొదలవుతుందని ఓ అధికారి తెలిపారు. ఇందుకోసం కొన్ని నిబంధనలను మార్చాల్సి వుండటంతో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి కూడా లేఖలు రాసినట్టు వెల్లడించారు. పాసింజర్ల స్పష్టమైన చిత్రాలు రికార్డు అయ్యేలా హెచ్డీ సీసీటీవీ కెమెరాలను అమర్చిన విమానాశ్రయాల్లో తొలుత ఈ ప్రాజెక్టు మొదలవుతుందని పేర్కొన్నారు.