Nitish Kumar: బీహార్ అత్యాచార బాధితులపై అఘాయిత్యాల కేసు.. రంగంలోకి సీబీఐ!
- ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ లో దారుణం
- విచారణను సీబీఐకి అప్పగిస్తూ నితీశ్ ఆదేశాలు
- నిన్న అసెంబ్లీలో అత్యాచారాలపై దుమారం
ముజఫర్ పూర్ లోని షెల్టర్ హోమ్ లోని అత్యాచార బాధితులపై అఘాయిత్యాలు జరిగిన కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అత్యాచారాలకు గురైన యువతుల ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపగా, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతోనే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ, రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ చేసిన కేసు విచారణను సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని డీజీపీకి ఆదేశాలు అందాయి. షెల్టర్ హోమ్ స్కాండల్ పై నిన్న అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. ఈ విషయంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, విచారణను ఎన్డీయే సర్కారు ప్రభావితం చేస్తోందని, నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముజఫర్ పూర్ లో సీఎం ప్రచార టీమ్ ఈ షెల్టర్ హోమ్ ను నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు.
మరోపక్క, వారం రోజుల పాటు 'ఎన్డీయే భాగో, బేటీ బచావో' పేరిట సైకిల్ ర్యాలీలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. షెల్టర్ హోమ్ స్కాండల్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని, విచారణను హైకోర్టు పర్యవేక్షించాలని కూడా ఇంతకుముందు ఆయన డిమాండ్ చేశారు. తాను స్వయంగా ముజఫర్ పూర్ వెళ్లి, బాధితులను కలిశానని చెప్పారు.