India: ముందస్తుకు ముందడుగు... ఈవీఎంలు, వీవీ పాట్స్ సిద్ధం చేసుకునే పనిలో ఈసీ!
- ఏకకాల ఎన్నికలకు యోచిస్తున్న ఎన్డీయే
- భెల్, ఈసీఐఎల్ కు భారీ ఆర్డరిచ్చిన ఈసీ
- ఇక ఏ ఎన్నికలైనా ఈవీఎం, వీవీపాట్ జత
దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలని భావిస్తున్న ఎన్డీయే సర్కారు, అందుకు తొలి అడుగుగా, ఈ సంవత్సరం చివరిలో, లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా అడుగులు వేస్తోందన్న వార్తలు వస్తున్న వేళ, ఎన్నికల కమిషన్ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఎన్నికల నిర్వహణ సామగ్రిని సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఇకపై ఏ ఎన్నికలనైనా ఈవీఎంలకు, వీవీపాట్ యంత్రాలను జత చేయాలని ఇంతకుముందే నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017 మే నెలలో 13.95 లక్షల ఈవీఎంలను, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్ లను, 16.15 లక్షల వీవీ పాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) లను సమకూర్చవలసిందిగా కోరుతూ ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్), ఈసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కు ఆర్డర్ ఇచ్చింది.
అయితే, ఈవీఎంలు సెప్టెంబర్ నెలాఖరుకి డెలివరీ అవడానికి సిద్ధం అవుతున్నాయి. కానీ, వీవీ పాట్స్ మాత్రం ఆలస్యమయ్యేలా వుందని తెలుస్తోంది. 5.88 లక్షల యూనిట్ల వీవీ పాట్స్ మాత్రమే (మొత్తం ఆర్డర్లో 36 శాతం) ఇంతవరకు సరఫరా అయ్యాయి. నవంబర్ నెలాఖరుకి మొత్తం యూనిట్స్ సరఫరా అవుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీవీ పాట్స్ లేనిదే ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు. దాంతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.