Tiruvananthapuram: ఇండియాలో తొలిసారి... లాకప్ డెత్ కేసులో పోలీసులకు మరణశిక్ష!
- తిరువనంతపురంలోని సీబీఐ కోర్టు సంచలన తీర్పు
- 2005 నాటి లాకప్ డెత్ కేసులో ఉరిశిక్షలు
- మరో ముగ్గురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష
తిరువనంతపురంలోని సీబీఐ కోర్టు సంచలన తీర్పిచ్చింది. పోలీసు కస్టడీలో ఉన్న ఓ యువకుడు మరణించిన కేసులో, ఇద్దరు పోలీసులది తప్పని, వారు దోషులేనని ప్రకటిస్తూ, వారికి మరణశిక్ష విధించింది. ఇండియాలో పోలీసు కస్టడీలో వ్యక్తి మృతిచెందితే మరణదండన విధించబడటం ఇదే తొలిసారి. కేరళలో పోలీసులకు మరణదండన విధించబడటము కూడా ఇదే తొలిసారి. మరణశిక్షతో పాటు దోషులకు రూ. 2 లక్షల జరిమానా విధిస్తున్నట్టు న్యాయమూర్తి జే నజీర్ వెల్లడించారు. 2005లో 26 సంవత్సరాల ఉదయ్ కుమార్ అనే వ్యక్తి పోలీసుల కస్టడీలో మరణించాడు.
ఈ కేసులో అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ గా ఉన్న కే జీతకుమార్, సివిల్ పోలీస్ ఆఫీసర్ ఎస్వీ శ్రీకుమార్లను ఉరితీయాలని, ఇతర నిందితులైన టీకే హరిదాస్, ఈకే సాబు, అజిత్ కుమార్ లకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తున్నానని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కేసులో మరో నిందితుడిగా ఉన్న కేవీ సోమన్ అనే వ్యక్తి కేసు విచారణ దశలో ఉన్న సమయంలో మరణించగా, మరో నిందితుడు వీపీ మోహనన్ పై సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటించింది.
ఓ దొంగతనం కేసులో విచారణకంటూ ఉదయ్ కుమార్ ను స్టేషన్ కు తీసుకు వచ్చిన పోలీసులు, దారుణంగా హింసించారు. జీతకుమార్, శ్రీకుమార్ దెబ్బలకు తాళలేక ఉదయ్ లాకప్ లోనే మరణించాడు. ఈ ఘటన తరువాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఉదయ్ కుమార్ తల్లి ప్రభావతి వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు, కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసు విచారణ 18 సంవత్సరాలు సాగింది.