Undavalli: రాజకీయాల్లోకి వచ్చి జీవితం పాడుచేసుకున్న వాళ్లే ఎక్కువ!: ఉండవల్లి అరుణ్ కుమార్
- నిజాయతీగా ఉండే నేతలకు అవకాశాలుండవు
- రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లు ఆమోదం పొందింది
- నేను రాజకీయాల్లో ఉంటా.. కానీ ఏ పార్టీలోకి వెళ్లను
పాలిటిక్స్ లోకి రావాలనే కోరిక కలగడం జెనెటిక్స్ డిఫెక్ట్ అని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిజాయతీగా ఉన్నా చాలా మంది రాజకీయ నేతలకు అవకాశాలుండవని, రాజకీయాల్లోకి వచ్చి జీవితం పాడుచేసుకున్న వాళ్లే ఎక్కువని అభిప్రాయపడ్డారు.
ఏపీ విభజన బిల్లు ఆమోదం విషయంలో ఆరోజున పార్లమెంట్ లో తలుపులు ఎందుకు మూశారు? అని ప్రశ్నించారు. సరిపడా సభ్యులు ఆనాడు పార్లమెంట్ లో లేరని, మెజారిటీ లేకున్నా, బిల్లు పాస్ అయిందని అన్నారు. డివిజన్ ఉండదంటే, హెడ్ కౌంట్ చేయాలి కానీ అలా కూడా జరగలేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ మాటను నాలుగేళ్లుగా తాను చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేసిన అనర్థమిదని విమర్శించారు.
ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసిన టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తాను రాజకీయాల్లో ఉంటాను గానీ, ఏ పార్టీలోకి వెళ్లనని, సలహాలు ఇస్తానని అన్నారు.