Pawan Kalyan: రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ కే అంతుంటే.. నిజాయతీ పరుడినైన నాకెంత ఉండాలి?: పవన్ కల్యాణ్
- నేను బలమైన వ్యక్తిని..మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను
- ఈ కోపంతోనే జగన్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయి
- రాజ్యాంగం రాసింది చంద్రబాబో..జగనో కాదు
వైసీపీ అధినేత జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతు, తాను బలమైన వ్యక్తిని కనుకనే తనపై జగన్ విమర్శలు చేశారని అన్నారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్నాననే కోపంతోనే జగన్, బీజేపీ నేతలు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ కే అంతుంటే, నిజాయతీ పరుడినైన తనకు ఎంత ఉండాలని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం రాసింది చంద్రబాబో, జగనో కాదని చురక అంటించారు.
సామాజికమార్పే ‘జనసేన’ ఆశయం
రాజకీయాలకు శ్రమ, ఓపిక చాలా అవసరమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సామాజికమార్పు తీసుకురావడం తన ఆశయమని, దానికోసమే సినిమాలను సాధనంగా ఉపయోగించుకున్నానని తెలిపారు. భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో 'నవయుగ జనసేన' పేరుతో సేవాకార్యక్రమాలు చేస్తున్న జన సైనికులతో ఈరోజు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది నాయకులు జనం మధ్య తగాదాలు పెట్టి విభజించి పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిని నిలువరించి ధైర్యంగా ఎదుర్కోవడానికే జనసేన పార్టీని ప్రారంభించానని అన్నారు. ‘జనసేన’ మూడో ప్రత్యామ్నాయంగా, మూడో ఆలోచన విధానం రావడం వల్లే ఉద్దానం, ఉండవల్లి వంటి సమస్యలు బయటకు వచ్చాయని గుర్తు చేశారు. ఉద్దానం కిడ్నీ సమస్యను బయటకు తీసుకొచ్చింది ఎవరో పెద్ద రాజకీయనాయకుడు కాదని, మీలాగే ఒక జన సైనికుడని అన్నారు. ప్రతిమండలానికి 15 నుంచి 20 మంది యువతతో ఓ కమిటీ వేస్తామని, ప్రజాసమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి గ్రామగ్రామానికి తిరిగి ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వ్యధలు స్వయంగా తెలుసుకోవాలని సూచించారు.
మీరు తెచ్చిన సమాచారంతోనే భావితరాల భవిష్యత్తు బాగుండడం కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలో నిర్ణయిద్దామని అన్నారు. రాజకీయాలకు వేల కోట్లు అవసరం లేదని, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడితే ప్రజలు మన వెనక ఉంటారని జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. వేల కోట్లు డబ్బులు ఉంటే అహంకారం, తలపొగరు పెరుగుతాయని అన్నారు. సహనానికి కూడా హద్దు ఉంటుందని, బెదిరించి, గూండాయిజానికి దిగితే భయపడొద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈరోజు ఉదయం నుంచి ఫంక్షన్ హాల్ కు భారీగా పవన్ అభిమానులు తరలివచ్చారు.