Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు!: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- పవన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జగన్ మండిపాటు
- పవన్ కు నిజంగా ఎక్కడున్నాయి విలువలు?
- నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు
తమకు కూడా ఓ పది మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలా అసెంబ్లీ నుంచి పారిపోయేవాడిని కాదని, అసెంబ్లీని స్తంభింపజేసేవాడినని మూడు రోజుల క్రితం విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై జగన్ ని ప్రశ్నించగా పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జగన్ ఈ రోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యల గురించి ఓ విలేకరి ప్రస్తావించగా.. జగన్ స్పందిస్తూ, ‘మన కర్మ ఏంటంటే.. ఇవాళ పవన్ కల్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నా మనం వినాల్సి వస్తోంది. నిజంగా, ఇది మన కర్మే. నాలుగేళ్లు ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారితోనూ, బీజేపీతోనూ.. వాళ్లిద్దరితోనూ కలిసి కాపురం చేశాడు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీ, బీజేపీల నుంచి ఆయన (పవన్ కల్యాణ్) బయటకొచ్చి తాను పతివ్రతను అని గట్టిగా చెబుతున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని పొడిచేశారు. పొడిచిన తర్వాత నాలుగేళ్లు గమ్మున ఉన్నారు. కలిసికట్టుగా సంసారం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకొచ్చి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. ఒకరేమో ’నేను తప్పు చేశాను’ అంటాడు. ఇంకో ఆయనేమో ‘నేను కాదు తప్పు చేసింది..మిగతా ఇద్దరు’ అంటాడు. మరో ఆయనేమో ‘ఆ ఇద్దరూ ఆమోదం తెలిపిన తర్వాతే..’ అని అంటాడు.
ఈయన (పవన్ కల్యాణ్) ఆరు నెలలకోసారి బయటకొస్తాడు. ఓ రోజు ఓ ట్వీట్ ఇస్తాడు. లేదంటే ఓ ఇంటర్వ్యూ ఇస్తాడు..పోతాడు.. నాలుగేళ్లుగా మనం చూసింది అంతే. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడటం మొదలు పెడితే.. దానికి మనం సమాధానం చెప్పాలంటే..ఎక్కడున్నాయి విలువలు? విలువల గురించి ఆయన (పవన్ కల్యాణ్) మాట్లాడతాడు.. నిజంగా తనకు ఎక్కడున్నాయి విలువలు?
నలుగురు.. నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఈ పని చేస్తే.. ‘నిత్యపెళ్లికొడుకు’ అని బొక్కలో వేస్తారా? లేదా? ఇది పాలీగామీ కాదా? ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు బయటకొచ్చి.. తానేదో సచ్ఛీలుడను అని మాట్లాడతారు. ఇలాంటి వాళ్ల గురించి మనం సీరియస్ గా తీసుకుని, వాళ్ల గురించి విశ్లేషించుకునే పరిస్థితికి రావడమంటే నిజంగా రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు బాధేస్తుంది’ అని అన్నారు.