gulam nabi azad: పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు.. ఇప్పుడేమో పట్టించుకోవడం లేదు: రాజ్యసభలో బీజేపీపై కాంగ్రెస్ ఫైర్
- హైదరాబాదుతో పాటు ఎన్నో ఆస్తులను ఏపీ కోల్పోయింది
- ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే
- ఏపీ పట్ల దేశమంతా సానుభూతిని చూపాలి
కొత్తగా ఏర్పడిన ఏపీ పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ అన్నారు. విభజన హామీలపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా అజాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైదరాబాదులాంటి నగరంతో పాటు, ఎన్నో ఆస్తులను ఏపీ కోల్పోయిందని, ఆ రాష్ట్రానికి అండగా నిలవాలని చెప్పారు. ఏపీతో తనకు ఎంతో అనుబంధం ఉందని, రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని విభజన సమయంలో బీజేపీ డిమాండ్ చేసిందని... ఇప్పుడేమో కుదరదని చెబుతోందని అన్నారు. హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు.
1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి, కర్నూలు రాజధానిగా ఏపీ ఏర్పడిందని... ఇప్పుడు మరోసారి పునర్విభజనకు గురైందని అజాద్ అన్నారు. విభజన వల్ల ఏపీ వనరులను కోల్పోయిందని, ఆ లోటును పూడ్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. ఏపీని యావత్ దేశం సానుభూతితో చూడాలని అన్నారు. నాలుగేళ్లు దాటినా ఏపీకి రెండు శాతం నిధులను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రెవెన్యూ లోటును కూడా కేవలం రూ. 400 కోట్లు మాత్రమే చెల్లించారని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు కేవలం రూ. 50 కోట్లను మాత్రమే చెల్లించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమూలకూ సరిపోవని చెప్పారు.