Siddharamaiah: లోక్ సభ ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేస్తాం!: సిద్ధరామయ్య

  • ఆషాఢం తర్వాతే రాష్ర్ట మంత్రివర్గ విస్తరణ
  • రాహుల్ గాంధీతో భేటీ అనంతరం సిద్ధరామయ్య వెల్లడి
  • కుమారస్వామితో కలసి ముందుకెళ్తామని స్పష్టీకరణ

2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో జనతాదళ్ (సెక్యులర్- జేడీఎస్)తో కలసి పోటీ చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయాలో ఇరుపార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. ఆషాఢ మాసం తర్వాత  రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దేశరాజధానిలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

పదవుల పంపకం అప్పుడే!


 ఆషాఢం తర్వాతే రాష్ట్రంలో పదవుల పంపకం జరగనుందని సిద్ధరామయ్య తెలిపారు. ఇందులో భాగంగా తొలిదశలో 30 కార్పొరేషన్లు, బోర్డులకు అధ్యక్షులతో పాటు పాలకమండలి సభ్యుల్ని నియమిస్తామన్నారు. వీటిలో కాంగ్రెస్ 20 సంస్థలను, జేడీఎస్ 10 సంస్థల్ని పంచుకుంటాయన్నారు. అధ్యక్షుల ఎంపికలో ఎమ్మెల్యేలకు తొలి ప్రాధాన్యమిస్తామని సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ  ఏర్పాటు సందర్భంగా పలువురు నేతలు మంత్రి పదవులు రానందుకు మనస్తాపం చెందారనీ, వాందరినీ సంతృప్తి పరచడమే లక్ష్యంగా తాజా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

కుమారస్వామికి నచ్చజెప్పండి!

ఇటీవల  ఓ బహిరంగ సభలో సీఎం కుమారస్వామి కన్నీరు పెట్టుకోవడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తప్పుడు భావన కలిగే అవకాశం  ఉందనీ,  ఇకపై ఇలాంటి పనులు చేయకుండా కుమారస్వామికి నచ్చజెప్పాలని సిద్ధరామయ్య రాహుల్ ను కోరారు. వచ్చే లోక్ సభ  ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వ్యూహాత్మకంగా లబ్ధి పొందేలా సీట్ల కేటాయింపు ఉండాలని  ఆయన రాహుల్ కు చెప్పారు. 

  • Loading...

More Telugu News