Assam: ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు పశ్చాత్తాపం.. మోకాళ్లపై నిల్చుని కాంగ్రెస్ ఎమ్మెల్యే క్షమాపణ
- ప్రభుత్వాసుపత్రిలో అందని వైద్య సేవలు
- వైద్యులను నియమించినా ఫలితం శూన్యం
- మనస్తాపానికి గురై ప్రజలకు క్షమాపణ
తన నియోజకవర్గంలోని ఆసుపత్రి ద్వారా ప్రజలకు సరైన సేవలు అందించలేకపోయిన ఓ ఎమ్మెల్యే రోగుల ముందు మోకాళ్లపై నిల్చుని క్షమాపణలు వేడుకున్నారు. అసోంలోని జోర్హత్ జిల్లాలో జరిగిందీ ఘటన. మరియానీ నియోజకవర్గం నుంచి రూప్‌జ్యోతి కుర్మి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీ ట్రైబ్ కమ్యూనిటీకి చెందిన ఆయన తండ్రి రూపమ్ కుర్మి మాజీ మంత్రి కూడా.
తన నియోజకవర్గంలోని నకచారి ప్రాంతంలో ఉన్న మహాత్మాగాంధీ మోడల్ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించి, నాణ్యమైన సేవలు అందిస్తానని ఎమ్మెల్యే గతంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగా 8మంది వైద్యులను నియమించారు. ఇదే ఆసుపత్రి మేనేజ్‌మెంట్ కమిటీకి ఆయన అధ్యక్షుడు కూడా. ఇటీవల ఓసారి ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. తాను నియమించిన వైద్యుల్లో ఒక్కరు కూడా ఆసుపత్రిలో కనిపించలేదు. దీంతో, ఈ విషయాన్ని ఆయన ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మకు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి గైర్హాజరైన వైద్యుల వేతనంలో ఒక రోజు జీతం కట్ చేస్తామని హామీ ఇచ్చారు.
ఫిర్యాదు చేసినప్పటికీ వైద్యుల ప్రవర్తనలో మార్పు రాలేదు. తాజాగా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యేకు గతంలోని సీనే కనిపించింది. వైద్యులు అందుబాటులో లేక రోగులు ఇబ్బంది పడుతుండడాన్ని గమనించారు. ఎమ్మెల్యేగా ఉండీ ప్రజలకు సరైన వైద్య సేవలు అందించలేకపోతున్నందుకు మనస్తాపానికి గురయ్యారు. రోగుల ఎదుట మోకాళ్లపై నిల్చుని, రెండు చేతులు జోడించి క్షమాపణలు వేడుకున్నారు. ఎమ్మెల్యే కుర్మి క్షమాపణలు వేడుకుంటున్న ఫొటో వైరల్‌గా మారింది.