YSRCP: వైసీపీకి ఝలక్ ఇచ్చిన ప్రతిపక్ష పార్టీలు.. నేటి బంద్‌లో ఒంటరిగా మారిన వైసీపీ!
- బంద్ నేపథ్యంలో పాదయాత్రకు జగన్ విరామం
- బంద్ సరికాదన్న జనసేనాని
- ఏకపక్షంగా పిలుపు ఇచ్చారంటున్న ప్రతిపక్షాలు
వైసీపీ ఆధ్వరంలో నేడు ఏపీలో రాష్ట్రవ్యాప్త బంద్ జరగనుంది. విభజనచట్టం అమలుపై లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ ఈ బంద్ చేపడుతోంది. బంద్‌ను పర్యవేక్షించేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి పాదయాత్రకు విరామం ప్రకటించారు. వైసీపీ బంద్‌కు విపక్షాల నుంచి మద్దతు కరువైంది. ఒక్క విపక్షం కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో వైసీపీ ఏకాకిగా మారింది. ప్రతిపక్షం పిలుపునిచ్చిన బంద్‌కు తోటి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, నవ్యాంధ్రలో కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు. నిజానికి ఓ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్‌కు పిలుపు ఇస్తే మిగతా పక్షాలు కూడా మద్దతు ప్రకటిస్తాయి.
అయితే, విపక్షాలు జగన్‌కు మద్దతు ప్రకటించకపోవడానికి కారణాలున్నాయి. ఆయన తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఎవరితోనూ సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. హోదా కోసం బంద్ నిర్వహించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బంద్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా వైసీపీ ముఖ్యనేతలు సోమవారం సీపీఐ, సీపీఎం నేతలతో చర్చలు జరిపినప్పటికీ వారు ససేమిరా అన్నారు. బంద్‌కు తాము మద్దతు ఇవ్వబోవడం లేదని కాంగ్రెస్ ఇప్పటికే తేల్చి చెప్పింది.