Parlament: ప్రజాస్వామ్యం హత్యకు గురైందంటూ.. పార్లమెంట్ వెలుపల రేపు వామపక్షాల ధర్నా!
- పశ్చిమబెంగాల్, త్రిపురల్లో చట్ట విరుద్ద పాలన
- ధర్నాలో పాల్గొననున్న పినరయి విజయన్, మాణిక్ సర్కార్
- వామపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బీజేపీ
పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో అధికార పక్షాల అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా...పార్లమెంట్ వెలుపల మంగళవారం ధర్నా నిర్వహించనున్నట్టు వామపక్షాలు ప్రకటించాయి. ప్రజాస్వామ్యం హత్యకు గురయిందని ఆరోపిస్తూ నిర్వహించనున్న ఈ ధర్నాలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, పశ్చిమబెంగాల్ కు చెందిన సీపీఎం సీనియర్ నేతలు, ఇతర నాయకులు పాల్గొంటారు.
పశ్చిమబెంగాల్, త్రిపుర సహా అనేక రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు కూడా జరుపుతామని సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు బిజన్ ధార్ చెప్పారు. పశ్చిమబెంగాల్, త్రిపురల్లో చట్ట విరుద్ద పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు విధ్వంసానికి గురవుతున్నాయని ఆయన ఆరోపించారు. తమ పార్టీల నేతల కార్యాలయాలపైనా, ఇళ్లపైనా అధికార పక్ష నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను దేశ ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్లేందుకు వామపక్షాల నేతలందరూ పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తారని ధార్ తెలిపారు.
త్రిపురలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మార్చి నెల నుంచి నలుగురు సీపీఎం నేతలు హత్యకు గురయ్యారని, వేలాదిమంది పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ధార్ ఆవేదన వ్యక్తం చేశారు. వందమంది మహిళలు సహా వెయ్యిమంది వామపక్ష కార్యకర్తలు గాయాలతో బాధపడుతున్నారని చెప్పారు. దాదాపు 750 సీపీఎం ఆఫీసులపై దాడి జరిగిందని, పార్టీ కార్యాలయాలను కాల్చివేయడమో, దాడిచేయడమో, ఆక్రమించడమో చేశారని తెలిపారు. త్రిపురలో స్వయంప్రతిపత్తి ఉన్న జిల్లా, గిరిజన ప్రాంతాలు సహా అన్నిచోట్లా స్థానిక సంస్థల సభ్యులను సీపీఎంకు రాజీనామా చేసి, బీజేపీలో చేరాలని నిర్బంధించారని ధార్ వెల్లడించారు.
అయితే ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. త్రిపురలో సుపరిపాలన సాగుతోందని ఆ పార్టీ చెప్పింది. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వామపక్షాలు ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేదని త్రిపుర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రతిమ భౌమిక్ విమర్శించారు. ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలకు ముందూ, తర్వాతా వామపక్షాలకు చెందిన దుండగుల చేతుల్లో 12 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు హత్యకు గురయ్యారని ప్రతిమ తెలిపారు.
ఇటీవలి ఎన్నికల్లో సీపీఎం గనుక విజయం సాధించి ఉంటే... ప్రతిపక్షానికి చెందిన వందలాది మంది నేతలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయేవారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షానికి చెందిన ఒక్క నేత కూడా బలవంతంగా రాష్ట్రాన్ని వదిలివెళ్లలేదని తెలిపారు. త్రిపురలో బిప్లబ్ కుమార్ దేబ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను సీపీఎం జీర్ణించుకోలేకపోతోందని ఆమె ఆరోపించారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తూ సీపీఎం ఆందోళనలు నిర్వహిస్తోందని ప్రతిమ మండిపడ్డారు.